Telugu Global
National

ఈసారి ల్యాండింగ్ పక్కా.. చంద్రయాన్ పై అంచనాలు పెంచిన ఇస్రో

చివరకు రోవర్ ల్యాండింగ్ కోసం నిర్దేశించిన ప్రదేశం విషయంలో కూడా వారు ఛాన్స్ తీసుకోలేదు. చంద్రయాన్‌-3లో ఇంధన పరిమాణాన్ని పెంచారు. అవసరమైతే రోవర్ ప్రత్యామ్నాయ ల్యాండింగ్‌ ప్రదేశానికి తరలివెళ్లేలా డిజైన్ చేశారు.

ఈసారి ల్యాండింగ్ పక్కా.. చంద్రయాన్ పై అంచనాలు పెంచిన ఇస్రో
X

చంద్రయాన్-2 ఎక్కడ ఫెయిలైందో.. అక్కడినుంచే చంద్రయాన్-3 ప్రస్థానం మొదలైంది. ఈసారి ఫెయిలయ్యే ఛాన్స్ లేకుండా పక్కాగా చంద్రుడిపై భారత్ ముద్ర పడేలా ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. అనుకున్న ప్రదేశంలో రోవర్ చంద్రుడిపై దిగేందుకు పరిస్థితులు సహకరించకపోతే.. అప్పటికప్పుడే మరో ప్రాంతాన్ని వెదుక్కుని అక్కడ ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన అదనపు ఇంధనాన్ని కూడా ఉంచుతున్నారు.

భూమిపై ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన ఈ చంద్రయాన్‌-3ప్రయోగం జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకి మొదలవుతుంది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగిస్తారు. LVM-3P4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్ మిషన్ నింగిలోకి దూసుకెళ్తుంది.

చంద్రుడిపై ల్యాండింగ్

జులై-14న రాకెట్ ప్రయోగిస్తారు. దాదాపు 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై చంద్రయాన్‌-3 అడుగుపెడుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ఈ రోవర్‌ ను దించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.

మధ్యలో ఏం జరుగుతుంది..?

రాకెట్ ప్రయోగం తర్వాత రోవర్ దానినుంచి విడిపోయి భూ కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అది భూ కక్ష్యకు దూరంగా జరిగిన తర్వాత దానిలోని ఇంధనాన్ని మరోసారి మండిస్తారు. అప్పుడు రోవర్ చంద్రుడి దిశగా దూసుకెళ్తుంది. చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న రోవర్ ని అనువైన సమయం చూసుకుని ఆగస్ట్ 23 లేదా 24 తేదీల్లో ల్యాండింగ్ కి ఏర్పాటు చేస్తారు.



ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ అంటే..?

చంద్రయాన్-3ని ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ తో రూపొందించామని చెప్పారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ విఫలం అయ్యే ఛాన్స్ లేకుండా ప్రతిచోటా రక్షణాత్మక చర్యలు తీసుకుంది ఇస్రో. ప్రతి దశలోనూ విఫలం అయ్యే అవకాశాలను బేరీజు వేసుకుంటూ, వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు శాస్త్రవేత్తలు. చివరకు రోవర్ ల్యాండింగ్ కోసం నిర్దేశించిన ప్రదేశం విషయంలో కూడా వారు ఛాన్స్ తీసుకోలేదు. చంద్రయాన్‌-3లో ఇంధన పరిమాణాన్ని పెంచారు. అవసరమైతే రోవర్ ప్రత్యామ్నాయ ల్యాండింగ్‌ ప్రదేశానికి తరలివెళ్లేలా డిజైన్ చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిషన్ ఫెయిల్ కాదు అని ధీమాగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

First Published:  11 July 2023 7:34 AM IST
Next Story