Telugu Global
National

ఫైనల్‌ స్టేజ్‌కి చంద్రయాన్‌-3.. మిగిలింది మరో వారం రోజులే..

ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంలో సాఫ్ట్ ల్యాండ్‌ అయిన కొద్ది గంటల్లోనే ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనను ప్రారంభించింది.

ఫైనల్‌ స్టేజ్‌కి చంద్రయాన్‌-3.. మిగిలింది మరో వారం రోజులే..
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. జూలై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3.. ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధృవంపై మొట్ట మొదటిసారి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కావడంతో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే చంద్రుని ఉపరితలంపై ఏడు రోజులు పూర్తి చేసుకున్న ఈ మిషన్‌.. మరో ఏడు రోజులు మాత్రమే తన పరిశోధనలను కొనసాగించనుంది.

ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంలో సాఫ్ట్ ల్యాండ్‌ అయిన కొద్ది గంటల్లోనే ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనను ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండింగ్ పాయింట్‌ శివశక్తి నుంచి దాదాపు 8 మీటర్ల దూరం ప్రయాణించింది. దీనిలో నాలుగు కీలకమైన పేలోడ్స్‌ ఉన్నాయి. ఈ పరికరాలు చంద్రునిపై కంపనాలు, చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలతో పాటు ప్లాస్మా సాంద్రతను పరిశీలిస్తాయి. అంటే అక్కడ ఉన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల స్థాయిని, కాలంతో పాటు వాటిలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తాయి.

ఇక ఇప్పటికే చందమామ ఉపరితలంతో పాటు కాస్త లోతులో సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలను గ్రాఫ్‌ రూపంలో వెల్లడించింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇది మొదటి డేటా అని స్పష్టం చేసింది. చంద్రుడి ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, ఫెర్రం వంటి మూలాకాలను ఈ పరికరాలు గుర్తిస్తాయి. చంద్రుడి ఉపరితలం గురించి, అక్కడి మట్టి గురించి మరింత అవగాహన పెంచుకోవడం ద్వారా.. భవిష్యత్‌ ప్రయోగాలకు మేలు చేస్తుందనేది ఇస్రో అభిప్రాయం.

ఇక ల్యాండర్, రోవర్ పని చేయడానికి విద్యుత్ అవసరం ఉంటుంది. ఈ విద్యుత్ వాటికి సోలార్‌ ప్యానళ్ల నుంచే వస్తుంది. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న సరిగ్గా సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్‌ మాడ్యూల్‌ను ఇస్రో ల్యాండ్ చేసింది. ఎందుకంటే చంద్రుడి మీద ఒక పగలు అంటే.. భూమ్మీద 14 రోజులకు సమానం. చంద్రుడి మీద సూర్యరశ్మి పడే పగటి సమయం మాత్రమే అక్కడున్న ల్యాండర్, రోవర్లకు విద్యుత్ అందుతుంది. తర్వాత అక్కడ పూర్తిగా చీకటి పడిపోతుంది కాబట్టి ల్యాండర్‌, రోవర్‌కు సూర్యరశ్మి అందదు. చంద్రుని ధృవాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 230 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. ఆ పరిస్థితులను తట్టుకునేలా ల్యాండర్, రోవర్ రూపొందించలేదు. ఫలితంగా, చంద్రునిపై సూర్యుడు అస్తమించిన ల్యాండర్‌, రోవర్‌ పని చేయవు. అయితే ఇప్పటికే చంద్రయాన్‌-3 చంద్రుని అన్వేషణలో అద్భుతమైన కృషి చేసిందంటున్నారు సైంటిస్టులు. ఈ ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త దారులను తెరిచిందని చెప్తున్నారు.

First Published:  30 Aug 2023 6:15 AM IST
Next Story