Telugu Global
National

చంద్రబాబు కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు

చివరి నిమిషంలో జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు, తనది ఒకే జిల్లా కావడంతో 'నాట్ బిఫోర్ మీ' అంటూ కేసు విచారణకు విముఖత చూపించారు.

చంద్రబాబు కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు
X

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుపై సీఐడీ పెట్టిన రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయడాన్ని ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు క్వాష్ తిరస్కరణపై రివ్యూ చేయాలని చంద్రబాబు తరుపు లాయర్లు సుప్రీంకోర్టులో సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సోమవారమే అత్యవసరంగా విచారించాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరినా.. అంత తొందర ఏముంది.. మంగళవారం కేసును మెన్షన్ లిస్టులో వేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.

ఇక మంగళవారం కూడా ఈ కేసు విచారణ జరగలేదు. బుధవారం ఈ కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి బెంచ్‌కు విచారణకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు, తనది ఒకే జిల్లా కావడంతో 'నాట్ బిఫోర్ మీ' అంటూ కేసు విచారణకు విముఖత చూపించారు. తన సహచర న్యాయమూర్తి భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే ఈ కేసును వచ్చే వారం పరిశీలిద్దామని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు.

కాగా, చంద్రబాబు తరపు లాయర్ సిద్దార్థ్ లాయర్ కేసును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు. ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరతామని, సోమవారం వాదనలు వినాలని సిద్ధార్థ లూథ్రా కోరారు. సోమవారం వాదనలు వినే అవకాశం లేదని.. వచ్చే వారం తప్పకుండా వింటామని జస్టిస్ ఖన్నా చెప్పారు. అంతే కాకుండా.. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వచ్చే వారం విచారణ విచారిస్తామని.. మా సహచరుడు భట్టి సుముఖంగా లేరు కాబట్టి.. వేరే జడ్జితో కలిసి ఈ కేసు విచారిస్తామని ఖన్నా పేర్కొన్నారు. అయితే సీజేఐ ఇచ్చే తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుందని చెప్పారు.

సిద్దార్థ్ లూథ్రా ఈ కేసును సీజేఐ చంద్రచూడ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరపాలని కోరారు. కాగా, చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్టు చేశారని లూథ్రా చెప్పారు. అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్‌కు కేటాయిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.

17ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని సిద్దార్థ లూథ్రా సీజేఐకి తెలిపారు. కాగా, ఏసీబీ కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేమని చెప్పారు. కనీసం సీఐడీ కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినా.. ఈ సమయంలో అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సీజేఐ తెలిపారు. ఈ కేసును అక్టోబర్ 3కు వాయిదా వేస్తున్నాము. ఆ రోజు ఏదో ఒక బెంచ్‌కు కేసును కేటాయిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు.


First Published:  27 Sept 2023 4:36 PM IST
Next Story