Telugu Global
National

ఆప్ అభ్యర్థే చండీగఢ్ మేయర్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవన్న సుప్రీంకోర్టు రిట్ర్నింగ్‌ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారని తేల్చి చెప్పింది.

ఆప్ అభ్యర్థే చండీగఢ్ మేయర్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో సంచలన తీర్పులను ఇచ్చిన సుప్రీంకోర్టు తాజాగా మరో ఘటనతో వార్తల్లో నిలిచింది. అయితే ఇది తీర్పు కాదు ఎన్నికల ఫలితం. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవన్న సుప్రీంకోర్టు రిట్ర్నింగ్‌ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారని తేల్చి చెప్పింది. అంతేకాదు ఆప్‌ కౌన్సిలర్‌ కుల్దీప్‌ కుమార్‌ను చండీగఢ్‌ మేయర్‌గా ప్రకటించింది.

ఈ ఏడాది జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌లో 35 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఆప్-కాంగ్రెస్ కూటమికి 20, బీజేపీకి 14, ఎస్ఏడీకి ఒక కౌన్సిలర్ ఉన్నారు.

మేయర్ ఓటింగ్ సందర్భంగా ఆప్-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది కౌన్సిలర్ల ఓట్లను చెల్లనివిగా ఆర్వో అనిల్ మాసిహ్ ప్రకటించారు. బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్‌ను విజేతగా ప్రకటించారు. సరిగ్గా ఈ సమయంలో రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాల్ని తారుమారు చేసిన వీడియో వెలుగు చూసింది.

బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ఎక్స్ మార్క్‌ పెడుతున్నట్లు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మంగళవారం మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం అనిల్ మాసిహ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది.

రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాషి ‘X’ మార్కు గీసి చెల్లనివిగా ప్రకటించిన ఓట్లను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతాలో వేసి ఓట్లను మళ్లీ లెక్కించాలని చండీగఢ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అంతే కాదు ఆ తర్వాత సుప్రీంకోర్టులోనే చండీగఢ్ మేయర్ ఎన్నిక కౌంటింగ్ నిర్వహించారు. దీంతో దశాబ్దాల సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ఎన్నికల కౌంటింగ్ కోర్టులో జరగ్గా.. ఫలితాలను న్యాయమూర్తులు ప్రకటించారు.


First Published:  20 Feb 2024 10:02 PM IST
Next Story