Telugu Global
National

చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు పెట్ట‌డం అందుకేనా?

భగత్ సింగ్ పేరును ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించుకోవడం, ఆయన పేరు వల్ల ఆప్ కు ప్రయోజనాలు చేకూరుతున్నాయనే ఆందోళనతో బీజెపి కొత్త ఎత్తుగడ వేసింది. చండీగడ్ ఏయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరు పెట్టనున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు పెట్ట‌డం అందుకేనా?
X

చండీగఢ్ విమానాశ్రయానికి స్వాతంత్య్ర‌ సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్ట‌నున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వెల్ల‌డించారు. ఆయ‌న ప్ర‌తీ నెలా నిర్వ‌హించే "మన్ కీ బాత్' రేడియో ప్ర‌సంగం లో ఈ విష‌యం ప్రకటించారు. "గొప్ప స్వాతంత్య్ర‌ సమరయోధుడికి నివాళిగా, చండీగఢ్ విమానాశ్రయానికి ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు" అని ప్రధాని మోడీ చెప్పారు. భ‌గ‌త్ సింగ్ పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్ర‌జ‌ల్లో అభిమానం సంపాదించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని గ్ర‌హించి బిజెపి ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది.

దిగ్గజ స్వాతంత్య్ర‌ సమరయోధుడికి లాంఛనప్రాయ నివాళిగా భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ముఖ్య‌మంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మ వేదిక ప్రాంతమంతా పుసుపుమ‌యంగా మారిపోయింది ఆనాడు. పసుపు తలపాగాలు భగవంత్ మాన్ యొక్క ట్రేడ్‌మార్క్. భ‌గ‌త్ సింగ్ విప్ల‌వానికి ప్ర‌తీక‌గా ప‌సుపు రంగు త‌ల‌పాగాలు ధ‌రించడంతో తాము కూడా ఆ రంగునే వాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే త‌న ప్ర‌మాణ స్వీకారానికి అంతా ప‌సుపు రంగు త‌ల‌పాగాలు,దుప‌ట్టాలు ధ‌రించి హాజ‌రుకావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వేదిక థీమ్ అంతా కూడా ప‌సుపు రంగుకే ప్రాధాన్యం ఇచ్చారు. అంతేగాక ఆయ‌న సీఎంగా ఆఫీసులోకి వెళ్ళిన కొద్ది రోజుల‌కే భగత్ సింగ్ అమరవీరుడు అయిన మార్చి 23వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తామని భగవంత్ మాన్ ప్రకటించారు.

యువతలోనూ, గ్రామీణ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన భగత్ సింగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నామ‌నే సంకేతాలు ఇచ్చేందుకు ఆప్ ఈ విధంగా జాగ్రత్తగా వ్యూహరచన చేసింది. దీంతో తాము వెన‌క‌బ‌డిపోతామేమోన‌న్న దుగ్థ‌తోనే బిజెపి ఈ పేరు పెట్టేందుకు సిద్ధ‌ప‌డింద‌ని అంటున్నారు.

ఇదే తొలిసారి కాదు..

కేంద్రపాలిత ప్రాంతంలోని విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు మార్చే ప్రతిపాదన చేయడం ఇదే మొదటిసారి కాదు. బీజేపీ నేతృత్వంలోని హర్యానా అసెంబ్లీ ఏప్రిల్ 2016లో దీనిపై ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బిజెపి రాష్ట్ర ప్రభుత్వ చర్యను అప్పుడు పక్కనే ఉన్న పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసిన‌దిగా భావించారు. పంజాబ్‌లోని మొహాలీ పట్టణంలో విమానాశ్రయం టెర్మినల్ భవనం ఉండ‌డంతో పంజాబ్ ప్రభుత్వం 'మొహాలీ విమానాశ్రయం' అనే బోర్డును ఏర్పాటు చేసి, హర్యానా ప్రభుత్వాకి ఝ‌ల‌క్ ఇచ్చింది.

మరుసటి సంవత్సరం, 2017లో, హర్యానాలోని బిజెపి ప్రభుత్వం స్వాతంత్య్ర‌ సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్టడానికి ఇష్టపడలేదని ప్రతిపక్షాలు ఆరోపించడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి మంగ‌ళ సేన్ పేరుపెట్టాల‌ని అప్ప‌ట్లో బిజెపి ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డంతో విప‌క్షాలు విమ‌ర్శించాయి. ఇలా ఈ విమానాశ్ర‌యం పేరు విష‌యంలో వివాదాలు చుట్టుముడుతూనేఉన్నాయి. ఇప్పుడు కూడా ఆప్ ఎక్క‌డ ప్ర‌తిష్ట పెంచుకుంటుందో అనే భావ‌న‌తోనే మోడీ ఈ ప్ర‌క‌ట‌న చేశార‌నేఏ విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

First Published:  25 Sept 2022 5:18 PM IST
Next Story