జార్ఖండ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనా కొన్ని గంటల పాటు సందిగ్ధత నెలకొంది. ఆఖరికి చంపయీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది.
జార్ఖండ్‌లో అనూహ్య పరిణామాల నడుమ శుక్రవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో శుక్రవారం ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం త్వరలోనే అసెంబ్లీలో బలపరీక్షలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ని మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ సుదీర్ఘ విచారణ చేసిన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా పలువురి పేర్లు చర్చలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనా కొన్ని గంటల పాటు సందిగ్ధత నెలకొంది. ఆఖరికి చంపయీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. 10 రోజుల్లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆదేశించారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ శాసనసభలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. మరోపక్క బలపరీక్ష నేపథ్యంలో సంకీర్ణ కూటమి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొందరు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి వారంతా గురువారమే హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించలేదు. శుక్రవారం వారందరినీ హైదరాబాద్‌కు తరలించి ఒక హోటల్‌లో ఉంచనున్నారని తెలుస్తోంది.