Telugu Global
National

రోడ్డుపై చెత్త వేస్తున్నారంటూ సీఎం ఇంటికి చలానా..

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్జీందర్ సింగ్ పేరు మీద చలానా జారీ చేశారు.

రోడ్డుపై చెత్త వేస్తున్నారంటూ సీఎం ఇంటికి చలానా..
X

రోడ్డుపై చెత్త వేసినందుకు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికే చలానా పంపించారు అధికారులు. 10వేల రూపాయలు చలానా కట్టాలని నోటీసు ఇచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ నివాసం నుంచి ప్రతి రోజూ రోడ్డుపై చెత్తపారబోస్తున్నారని, గతంలో వారికి ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదంటూ ఇప్పుడు చలానా విధించి నోటీసు ఇచ్చారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఈమేరకు నోటీసు ఇచ్చింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్జీందర్ సింగ్ పేరు మీద చలానా జారీ చేశారు.

ముఖ్యమంత్రి ఇంటికే చలానా ఇచ్చారంటే అక్కడ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో అనుకోవాలి, లేదా సీఎం ఇంటి సిబ్బంది బాధ్యతా రాహిత్యం అయినా వార్తల్లోకెక్కాలి. కానీ ఇది చెత్త రాజకీయంగా తేలుతోంది. చండీగఢ్ మున్సిపాల్టీలో బీజేపీ అధికారంలో ఉంది. ఇటీవల పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎం నివాసాన్ని కావాలనే టార్గెట్ చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంటున్నారు.

స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధూ మాత్రం సీఎం ఇంటినుంచి పదే పదే చెత్తను బయట వేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో స్థానికులనుంచి తమకు పదే పదే ఫిర్యాదులందాయని, సీఎం ఇంటి సిబ్బందికి ఈ విషయం తెలియజేసినా ఫలితం లేదని అంటున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకే సీఎం ఇంటికి జరిమానా విధించామని చెప్పారు. కానీ చలానా విషయంలో రాజకీయ కలకలం రేగింది.

First Published:  23 July 2022 12:32 PM GMT
Next Story