‘డీప్‌ఫేక్’పై కేంద్రం అలర్ట్ - సోషల్ మీడియా సంస్థలతో త్వరలో భేటీ!
డీప్ ఫేక్ వీడియోల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ భేటీలో చర్చించనున్నట్లు ఆయన వివరించారు. గూగుల్, మెటా వంటి పెద్ద పెద్ద టెక్ సంస్థలు కూడా ఈ భేటీలో పాల్గొంటాయని చెప్పారు.
అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి.. పలువురు సినీతారలు, ప్రముఖులను ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెక్నాలజీ దుర్వినియోగమవుతున్న తీరు పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సైతం ఈ తరహా వీడియోలు సమాజంలో అలజడికి, కొత్త సమస్యలకు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ తరహా వీడియోల వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా త్వరలోనే సోషల్ మీడియా సంస్థలు, ప్రభుత్వం సమావేశం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వెల్లడించారు.
డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చామని వైష్ణవ్ చెప్పారు. మరిన్ని చర్యలు అవసరమని, రాబోయే మూడు, నాలుగు రోజుల్లో సోషల్ మీడియా సంస్థలతో భేటీ కాబోతున్నట్లు ఆయన తెలిపారు. డీప్ ఫేక్ వీడియోల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ భేటీలో చర్చించనున్నట్లు ఆయన వివరించారు. గూగుల్, మెటా వంటి పెద్ద పెద్ద టెక్ సంస్థలు కూడా ఈ భేటీలో పాల్గొంటాయని చెప్పారు. ఒకవేళ ఏదైనా సంస్థ తగిన చర్యలు తీసుకోకుంటే ఐటీ చట్టం కింద ఆయా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
♦