Telugu Global
National

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తున్న కేంద్రం

రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల వాటాతో కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకొంటుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అరకొర నిధులతో నెట్టుకొస్తున్నాయి. కేంద్రం రాష్టాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తున్నదనే విమర్షలు ఎక్కువయ్యాయి.

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తున్న కేంద్రం
X

రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య పన్నులు, వాటా విషయంలో సమతుల్యతను పాటిస్తూ.. వాటి మధ్య వారధిగా ఉండాల్సిన నీతి ఆయోగ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికా సంఘం పేరును మార్చి నీతి ఆయోగ్ గా మార్చినంత మాత్రాన ఇందులోని 'నీతి' వట్టి 'నేతి బీరకాయ' చందమే' అంటే అతిశయోక్తి లేదు.. ఒకసారి ఈ సమస్యలోతుల్లోకి వెళ్లి చూస్తే.. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. ప్రధాని మోడీ ప్రభుత్వ నిర్వాకానికి రాష్ట్రాలు బలవుతున్నాయి. రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల వాటాతో కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకొంటుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అరకొర నిధులతో నెట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు జీఎస్టీ లాంటి పన్నుల బాదుడు నుంచి తమను రక్షించాలంటున్న వీటివి అరణ్య రోదనలుగానే మిగులుతున్నాయి. ఆ మధ్య ఢిల్లీలో మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమ రెవెన్యులు తగ్గిపోతుండడం పట్ల అనేకమంది ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల డివిజిబుల్ పూల్ లో తమ రాష్ట్రాల వాటా పెంచాలని, జీఎస్టీ పరిహారాన్ని కూడా పెంచితే తప్ప మరో మార్గం లేదని కోరారు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఇదే పెద్ద జటిల సమస్యగా మారుతోంది. రైతులకు రుణ మాఫీ, ఉజ్వల్ డిస్కం అస్స్యూరెన్స్ యోజన, వంటి పథకాల అమలుతో రాష్ట్రాల ఆర్ధిక స్థితి క్షీణీస్తోంది. 2019-2020 సంవత్సరాల్లో వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. దానికి తగినట్టు కోవిడ్ పాండమిక్ కూడా తోడయింది. రాష్ట్రాల ఆదాయాలు చాలావరకు తగ్గిపోయాయి. అందువల్లే.. ఇప్పుడైనా ఆదాయాన్ని ఎవరు పెంచుతారు.. వ్యయాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్నను చర్చించుకోవాల్సి వస్తోన్నది.

భారత రాజ్యాంగం ప్రకారం ఆదాయాన్ని పెంచుకునే అధికారం కేంద్రానికే ఉంటుంది. ఇదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రాల బాధ్యతగా మారాయి. ఒకసారి 15 వ ఆర్ధిక సంఘం నివేదికను పరిశీలిస్తే.. 2019 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వనరులు 62.7 శాతం పెరిగితే.. రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం 62.4 శాతం ఉంది. ఈ రిపోర్టు లోని మొదటి భాగం ప్రకారం.. ఆ ఆర్థిక సంవత్సరంలోమొత్తం వనరుల్లో కేంద్ర, రాష్ట్రాల వనరుల వాటా, వ్యయం పెరిగాయి. అయితే పన్నుల , కేటాయింపునకు సంబంధించిన అధికారాలు , వ్యయానికి సంబంధించిన బాధ్యతల్లో అసమానత హెచ్చుగా కనిపించింది. అందువల్లే రాష్ట్రాలతో ఆదాయ వాటా విషయంలో రాజ్యాంగం జాగ్రత్తగా కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచడంలో గల అసమానతను తగ్గించడానికి ఆయా ఆర్ధిక సంఘాలు (ఫైనాన్స్ కమిషన్లు) ప్రయత్నించాయి. రాష్ట్రాల స్థూల పన్నుల వాటాను 40 శాతానికి పైగా 14,15 ఆర్ధిక సంఘాలు పెంచినప్పటికీ కచ్చితంగా ఈ స్థాయికి వాటా చేరలేదు. 2019 ఆర్ధిక సంవత్సరంలో ఇది 36.6 శాతం ఉండగా రాష్ట్రాల షేర్ ఇంకా తగ్గిపోయి 29 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫారసులు వ్యర్థమయ్యాయి. అంతరం, అసమానత 11 శాతం పైగా పెరిగిపోయాయి. రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య సమతుల్యంగా ఉండాల్సిన పరిస్థితి మరింత నీరు గారింది. రెండు దశాబ్దాల్లో 11 శాతం హెచ్చు తగ్గుదల వచ్చిందంటే ఏమనుకోవాలి ? పన్నుల డివిజిబుల్ పూల్ లో రాష్ట్రాల వాటా తగ్గిన విషయాన్ని ఈ రిపోర్టు లోని రెండో భాగం ప్రస్తావించింది.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల షేర్ ని ఆర్ధిక సంఘం పెంచినప్పటికీ ఇది డివిజిబుల్ పూల్ లో తగ్గుదల కారణంగా ఆ స్థాయికి పెరగలేదు. కోవిడ్ పాండమిక్ సమయంలోని ఆదాయమే ఇందుకు నిదర్శనం. ఆ తరుణంలో స్థూల ట్యాక్స్ రెవెన్యులు దారుణంగా తగ్గాయి. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన పన్నుల వాటా 2020 ఆర్ధిక సంవత్సరంలో 15 శాతానికి, 2021 లో మరీ తక్కువగా అంటే 9 శాతానికి పడిపోవడం దారుణం. కానీ అదే సమయంలో కేంద్ర ఆదాయం మాత్రం వాటా పెరుగుతూ వచ్చింది. ఇందుకు కారణం రాష్ట్రాలపై అది సెస్సులు, సర్ చార్జీలను విధించడమే. వీటి విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించే పని లేదన్న మాట.. గత కొన్ని సంవత్సరాల్లో స్థూల ట్యాక్స్ రెవెన్యూలో సెస్సులు, సర్ చార్జీల వాటా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2012 ఆర్థిక సంవత్సరంలో ఈ

వాటా 10.4 శాతం ఉండగా 2021 నాటికి ఇది 20 శాతానికి పెరిగింది. అంటే కేంద్ర ఆదాయాలు వాటికవే పెరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. ఆర్ధిక సంఘం నివేదికలోని 3, 4 భాగాల్లో .. ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

పెట్రో ఉత్పత్తులపై పెంచిన సుంకాలు, ఇతరత్రా పన్నులను ఇవి గుర్తు చేశాయి. సెస్సులు, సర్ చార్జీలు ఉండనే ఉన్నాయి. వనరులను పెంచడానికి రకరకాల సెస్సులు, సర్ చార్జీలను విధిస్తోంది కేంద్రం. వీటిని రిజర్వ్ ఫండ్స్ గా బదలాయిస్తున్నారు. 2020 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 40 శాతం సెస్సుల బాదుడు బాదారు. ఇవి 78 వేల కోట్ల రూపాయల విలువైన సెస్సులట. వీటిని రిజర్వ్ ఫండ్స్ లోకి మార్చలేదు కూడా.. 2010-2020 మధ్య సంవత్సరాల్లో క్రూడాయిల్ మీద రూ.1.28 లక్షల కోట్ల సెస్సును వసూలు చేశారు. కానీ ఆయిల్ ఇండస్ట్రీ డెవెలప్మెంట్ బోర్డుకు ఒక్క రూపాయి కూడా ట్రాన్స్ ఫర్ కాలేదు. అందువల్లే సెస్సులు, సర్ చార్జీలవంటి వాటి విషయంలో కాగ్.. ఈ సమస్యలను లేవనెత్తింది. రాష్ట్రాలపై భారం పెరుగుతోందంటే పెరగదూ మరి ? ఆదాయం విషయంలో తమరాష్ట్రాల వాటా పెంచాలంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదే పనిగా కోరుతున్నారంటే వారి అభ్యర్థన సముచితంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. జీఎస్టీ పరిహారాన్ని పెంచాలన్న వారి కోర్కెను కేంద్రం ఇంకా చాప కింద తొక్కిపెట్టి ఉంచుతోంది.

First Published:  24 Aug 2022 11:01 AM IST
Next Story