వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా కేంద్రం అడుగులు..!
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ ప్రకారం లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనేది ఆలోచన. గతంలో చాలా సార్లు ఈ అంశంపై సమాలోచనలు జరిగినప్పటికీ.. ఆచరణలో సాధ్యం కాలేదు.
కేంద్రంలోని మోడీ సర్కార్ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ వైపు అడుగులు వేస్తోందా..! సెప్టెంబర్ నెలలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్ ప్రవేశ పెట్టనుందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలుంటాయని జరుగుతున్న ప్రచారం ఈ అంశానికి మరింత బలం చేకూరుస్తోంది.సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. ఇదే సమావేశాల్లో వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లుతో పాటు యునిఫామ్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ ప్రకారం లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనేది ఆలోచన. గతంలో చాలా సార్లు ఈ అంశంపై సమాలోచనలు జరిగినప్పటికీ.. ఆచరణలో సాధ్యం కాలేదు. ప్రస్తుతం లోక్‌సభకు కానీ, రాష్ట్రాల అసెంబ్లీలకు వాటి కాల పరిమితి ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతి ఏడాది కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. అయితే అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఒకేసారి, ఒకే రోజులో ఓటింగ్ పూర్తి చేయాలన్నది వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఉద్దేశం.
ఇక స్వాతంత్య్రం వచ్చాక 1951-52లో దేశంలో ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు లోక్‌సభతో పాటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించారు. తర్వాత 1957, 1962, 1967లో కూడా ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ తర్వాత నుంచి క్రమం తప్పింది. మళ్లీ 1999లో లా కమిషన్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే బాగుంటుందని తన రిపోర్టులో అభిప్రాయ పడింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 2015లో చట్ట, న్యాయ అంశాల పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం గురించి ఆలోచిస్తోందన్నారు. అయితే ఈ అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక దీంతో పాటు యునిఫామ్ సివిల్ కోడ్ బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతారని తెలుస్తోంది. దేశంలో వివిధ మతాలు, విశ్వాసాలను బట్టి పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత లాంటి అంశాలకు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే మతం, లింగం, లైంగిక అంశాల తేడా ఉండదు. అందరికీ ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది.
*