సైబర్ క్రైమ్‌కి చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త నిర్ణయం
ప్రస్తుతం కొందరు సిమ్ డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే సిమ్ కార్డులను విక్రయిస్తున్నారని, ఇకనుంచి అలాంటివి ఉండవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
సైబర్ క్రైమ్‌కి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులు విక్రయించే డీలర్ల (SIM dealers)కు పోలీస్ వెరిఫికేషన్ (Police verification) తప్పనిసరి చేసింది. అంతేకాదు.. బల్క్ (ఎక్కువ మొత్తంలో) సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపైనా ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం కొందరు సిమ్ డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే సిమ్ కార్డులను విక్రయిస్తున్నారని, ఇకనుంచి అలాంటివి ఉండవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నారని, వారంతా పోలీసు వెరిఫికేషన్ పూర్తి చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు.
బల్క్ కనెక్షన్ల నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దాని స్థానంలో బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. గతంలో కంపెనీ కేవైసీని మాత్రమే వెరిఫై చేసి ఈ సిమ్‌లను ఇచ్చేవారని, ఇప్పుడు ఉద్యోగుల కేవైసీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాతే సిమ్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. దీనివల్ల నేరగాళ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.