మణిపూర్ అమానవీయ ఘటన కేసు సీబీఐకి..!
మణిపూర్‌లో దాదాపు మూడు నెలలుగా జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు.
మణిపూర్‌లో జాతి వైషమ్యాల నేపథ్యంలో అక్కడ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటన దేశమంతటా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించేందుకు నిర్ణయించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసు విచారణను కూడా మణిపూర్ రాష్ట్రం బయట చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రమైన అస్సాంలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణ చేపట్టాలని కోరనున్నట్లు వివరించాయి. మరోవైపు ఈ ఘర్షణలకు కారణమైన మైతేయ్, కుకీ వర్గాలతోనూ కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరుపుతోందని.. రాష్ట్రంలో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే ఈ చర్చల ప్రక్రియ తుది దశలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మణిపూర్‌లో దాదాపు మూడు నెలలుగా జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మైతేయ్, కుకీ వర్గాల ప్రజలతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘర్షణలు మొదలైన మే మొదటి వారం నుంచి ఇప్పటివరకు సుమారు వేల సంఖ్యలో ఎఫ్ఎస్ఐఆర్లు నమోదైనట్లు అంచనా. అంతేకాకుండా రాష్ట్ర పోలీసులకు చెందిన వేల సంఖ్యలో ఆయుధాలను నిరసనకారులు దోచుకున్నట్లు సమాచారం.
మరోపక్క సీబీఐకి ఈ కేసును అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయానికి ప్రధాన కారణం.. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసనలేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత పెరగనివ్వకుండా నష్ట నివారణ కోసమే కేంద్రం ఈ చర్యలకు సిద్ధమైందని జనం మండిపడుతున్నారు.