Telugu Global
National

జాతీయ జెండా కోడ్ సవరించిన కేంద్రం.. ఎప్పుడైనా పతాకాన్ని ఎగరేయవచ్ఛు

కేంద్ర ప్రభుత్వం జాతీయ జెండా కోడ్ ను సవరించింది. ఇకపై ప్రజలు తమ ఇళ్ళపై ఎప్పుడైనా జాతీయ జెండా ఎగరవేయవచ్చు. ఇప్పటివరకు జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఎగురవేసేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు రాత్రి కూడా ఎగురవేసేందుకు అనుమతి ఇస్తూ కోడ్ ను సవరించారు.

జాతీయ జెండా కోడ్ సవరించిన కేంద్రం.. ఎప్పుడైనా పతాకాన్ని ఎగరేయవచ్ఛు
X

దేశ 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముందు 'హర్ ఘర్ తిరంగా' (ఇంటింటిపై జెండా) ప్రచారానికి పిలుపునిచ్చిన కేంద్రం జాతీయ జెండా కోడ్ ను సవరించింది. ఈ సవరించిన కోడ్ ప్రకారం ప్రజలు .. పగలు, రాత్రి కూడా తమ ఇళ్లపై జాతీయ పతాకాలను ఎగురవేయవచ్చు. ఇప్పటివరకు జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఎగురవేసేందుకు అనుమతి ఉండేది. ఈ నిబంధనను ప్రభుత్వం మార్చింది. ఈ నెల 20 న జెండాకు సంబంధించిన కోడ్ ని మార్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా లోని క్లాజ్-(xi)పేరా 2.2 .లోని .పార్ట్-2 ను సవరించి -(xi) గా మార్చినట్టు వివరించాయి. దీనిప్రకారం ప్రజల్లో ఎవరైనా తమ ఇంటిపై పగలు, రాత్రి కూడా జాతీయ జెండాను ఎగురవేయవచ్ఛునని స్పష్టం చేశాయి. అలాగే పతాకాన్ని తయారు చేయడానికి వాడే మెటీరియల్ ని కూడా సవరించారు. పాలీయెస్టర్ తో మెషిన్ పై త్రివర్ణ పతాకాన్ని తయారు చేసేందుకు కేంద్రం అనుమతించింది. 75 ఏళ్ళ భారత స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' ని నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు -మూడు రోజులపాటు 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని ప్రభుత్వం లాంచ్ చేస్తోంది. ఈ తేదీల మధ్య ప్రతి భారతీయుడు తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ ఈ నెల 22 న పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని పురస్కరించుకుని వచ్చేనెల ఆ మూడు రోజులూ దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికిపైగా ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం సూచించింది. మాతృ భూమి సేవలో పునరంకితమయ్యేందుకు చేపట్టిన ప్రచారోద్యమంలో 100 కోట్లమంది ప్రజలు పాల్గొంటారని తెలిపింది. ఇది ప్రజల్లో దేశభక్తిని పెంపోందిస్తుందని కేంద్రం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

కాగా గత ఏడాది డిసెంబరు 30 న ఒకసారి జెండా కోడ్ ని సవరించారు. చేతితో వడికిన లేదా యంత్రంతో కాటన్ లేక పాలియెస్టర్ లేదా వూల్, లేక సిల్క్ ఖాదీతో జెండాను తయారు చేయవచ్చునని అప్పట్లో పేర్కొన్నారు. అంతకుముందు యంత్రంతో పాలియెస్టర్ పతాకాల తయారీపై నిషేధం ఉండేది. ఇప్పుడు పాలియెస్టర్ తో చేయవచ్చు. అయితే జెండా కోడ్ సవరణను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ఖండించారు. ఈ సవరణ ద్వారా కేంద్రం ఖాదీని , స్వాతంత్య్ర సమర యోధులను అవమానించినట్టవుతుందని ఆయన విమర్శించారు. కర్ణాటక హుబ్బళి లో ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖాదీతో అక్కడ తయారయ్యే జెండాల తయారీని పరిశీలించారు.




First Published:  24 July 2022 8:30 AM IST
Next Story