Telugu Global
National

ప్రతి పైసాకీ పన్ను.. మోదీ వజ్రోత్సవ కానుక..

ప్రజలంతా కొత్త విధానంపై ఆసక్తి చూపించేలా తాయిలాలు ప్రకటిస్తోంది. ఓసారి అందరూ ఇటువైపు వచ్చాక, పాత విధానం రద్దుచేసే కుట్రకు తెరతీస్తుంది. ఆ తర్వాత రాయితీలు లేని ఐటీ విధానంతో బాదుడే బాదుడుకి ప్రజలు అలవాటు పడాల్సిందే.

ప్రతి పైసాకీ పన్ను.. మోదీ వజ్రోత్సవ కానుక..
X

కేంద్ర బడ్జెట్ అంటే ఆదాయపు పన్ను రాయితీలను పెంచుతారని సగటు వేతన జీవి ఆశగా ఎదురు చూస్తుంటాడు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రాయితీల పెంపుపై ఆశలు చచ్చిపోయాయి. ఇప్పుడు ఆ రాయితీలకు కూడా పూర్తిస్థాయిలో మంగళం పాడేందుకు సిద్ధమైంది కేంద్రం. నూతన ఐటీ చట్టం బలవంతం కాదు, కేవలం ఆప్షన్ మాత్రమేనన్న కేంద్రం.. ప్రజలంతా కొత్త విధానంపై ఆసక్తి చూపించేలా తాయిలాలు ప్రకటిస్తోంది. ఓసారి అందరూ ఇటువైపు వచ్చాక, పాత విధానం రద్దుచేసే కుట్రకు తెరతీస్తుంది. ఆ తర్వాత రాయితీలు లేని ఐటీ విధానంతో బాదుడే బాదుడుకి ప్రజలు అలవాటు పడాల్సిందే.

తాయిలాలు ఎలాగంటే..?

కొత్త విధానంలో రూ.5 లక్షల నుంచి ఏడున్నర లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి 10 శాతం మాత్రమే పన్ను వసూలు చేస్తోంది. పాత విధానంలో ఇది 20 శాతం ఉంది. రూ.ఏడున్నర లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారి వద్ద కేవలం 15 శాతం మాత్రమే పన్ను తీసుకుంటానంటోంది. పాత విధానంలో ఇది కూడా 20 శాతంగా ఉండేది. చివరిగా రూ.15 లక్షల పైన ఆదాయం ఉన్నవారికి మాత్రం పాత విధానంలాగే కొత్త విధానంలోనూ 30 శాతం పన్ను విధించింది. ఇక కొత్త విధానంలో రాయితీలు ఉండవు. అంటే సెక్షన్ 80సి కింద గృహ రుణాలు, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నా కూడా మినహాయింపు ఉండదన్నమాట. అంటే ఇలాంటి రుణాలు లేనివారంతా కచ్చితంగా కొత్త విధానంవైపు మొగ్గు చూపుతారు. అలా వీలైనంత ఎక్కువ మందిని ఆకర్షించడమే కేంద్రం కొత్త పాలసీ. అంటే ఎక్కువ శాతం మంది పాత విధానాన్ని వదిలిపెడితే, దానికి ప్రజాదరణ లేదనే నెపంతో పక్కనపెట్టాలని ఆలోచిస్తోంది కేంద్రం.

2020 ఫిబ్రవరి-1న రాయితీలకు మంగళం పాడుతూ కొత్త ఐటీ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాయితీలు లేకుండా ఉన్న కొత్త విధానాన్ని ప్రజలపై రుద్దే ఉద్దేశం తమకు లేదని, అది కేవలం ఛాయిస్ మాత్రమేనని చెప్పింది. వాస్తవానికి కొత్త విధానంలో వసూలు చేసే పన్ను తక్కువే అయినా ఎక్కువ మంది పన్ను పరిధిలోకి వస్తారు. కొత్త విధానం తమకి లాభం అని ప్రజలు భావిస్తారు, కానీ అది ప్రభుత్వానికే ఎక్కువ లాభదాయకం అనేది అసలు రహస్యం. క్రమంగా ప్రజలందర్నీ కొత్త పన్ను విధానంలోకి లాక్కురావడమే ఇక్కడ కేంద్రం ముందున్న ప్రధాన కర్తవ్యం. దీని కోసం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకుంటోంది కేంద్రం.

తర్వాత ఏమవుతుంది..?

ప్రస్తుతానికి ఎక్కువ మందికి లాభం చేకూరుతుంది అనుకున్నా... ఆ తర్వాత శ్లాబుల విషయంలో కేంద్రం ఇష్టమొచ్చినట్టు మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఎలాగూ సెక్షన్ 80-సి మినహాయింపులు లేవు కాబట్టి, రాయితీలు వర్తించేవారు ఎవరూ ఉండరు. అంటే రాబోయే రోజుల్లో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి మేలు చేకూరుస్తుంది. పరిధి దాటిన ప్రతి పైసాపై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రం, పెన్షన్ స్కీమ్‌లకు కూడా మంగళం పాడేసింది. సైన్యంపై ఖర్చును కూడా తగ్గించేసుకుంది. చివరికిప్పుడు ఆదాయపు పన్ను రాయితీలను కూడా పూర్తిగా తొలగించే పథకాలు రచిస్తోంది.

First Published:  17 Aug 2022 4:57 PM IST
Next Story