Telugu Global
National

ఉక్రెయిన్ విద్యార్థులకు ఆ ఛాన్స్ లేదు.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. భారత్ లో మిగతా కోర్స్ కంప్లీట్ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్రం మాత్రం కుదరదని తేల్చి చెప్పేసింది. భారత్ లో అడ్మిషన్లు ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఉక్రెయిన్ విద్యార్థులకు ఆ ఛాన్స్ లేదు.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
X

ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతూ యుద్ధం కారణంగా భారత్ కి తిరిగొచ్చేసిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు ఇతర దేశాల్లో మిగిలిన కోర్స్ పూర్తి చేసేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఉక్రెయిన్ విద్యాసంస్థలు కూడా తమ యూనివర్శిటీల నుంచే సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇచ్చాయి. అయితే ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. భారత్ లో మిగతా కోర్స్ కంప్లీట్ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు విచారణకు రాగా కేంద్రం మాత్రం కుదరదని తేల్చి చెప్పేసింది. ఉక్రెయిన్ లో మెడిసిన్ మధ్యలో ఆపేసి వచ్చిన విద్యార్థులకు భారత్ లో అడ్మిషన్లు ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

నిబంధనలకు విరుద్ధం..

విదేశాల్లో చదువుకుంటూ మధ్యలో ఆపేసి భారత్ కి తిరిగొచ్చిన విద్యార్థులు ఇక్కడ మెడిసిన్ కోర్స్ పూర్తి చేసే అవకాశం లేదు. కేవలం నీట్ పరీక్షలో ర్యాంకులు వచ్చినవారికి మాత్రమే ఇక్కడ మెడిసిన్ చేసే అవకాశముంది. లేదా మేనేజ్‌మెంట్‌ కోటాలో ఇక్కడే మొదటి సంవత్సరం నుంచి కోర్సు చేరాల్సి ఉంటుంది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చట్టం, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాల ప్రకారం వైద్య విద్యను మధ్యలోనుంచి మొదలు పెట్టడం కుదరదు. దీంతో ఆయా చట్టాల ప్రకారం ఉక్రెయిన్ విద్యార్థులకు ఇక్కడ సీట్లు కేటాయించడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది.

భారత్ లో మేనేజ్‌మెంట్ కోటాలో మెడిసిన్ చదువుకి డబ్బులు ఖర్చు చేయలేని తల్లిదండ్రులు, ఉక్రెయిన్ లాంటి దేశాలకు పిల్లల్ని పంపుతున్నారు. అక్కడ మెడిసిన్ చదివినా భారత్ లో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉండటంతో చాలామంది విదేశాల్లో మెడిసిన్ చదువుకోసం వెళ్తున్నారు. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈసారి పరిస్థితి తారుమారైంది. దీంతో వేలాదిమంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేసి భారత్ తిరిగొచ్చేశారు. వారంతా ఇక్కడే కోర్స్ పూర్తి చేస్తామంటున్నారు. కానీ నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం వల్లే విద్యార్థులు ఉక్రెయిన్ లో మెడిసిన్ చదివేందుకు వెళ్లారని, వారిని తిరిగి ఇక్కడ చేర్చుకుంటే.. నీట్ పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులకు అన్యాయం చేసినట్టేనని కేంద్రం వాదిస్తోంది. ఎన్ఎంసీ చట్టానికి ఇది విరుద్ధం అని చెబుతోంది. ఉక్రెయిన్ యూనివర్శిటీల అనుమతితో వారు ఇతర దేశాల్లో మెడిసిన్ పూర్తి చేయొచ్చని అంటోంది. అంతేకాని భారత్ లో కోర్స్ పూర్తి చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

First Published:  15 Sept 2022 9:11 PM IST
Next Story