Telugu Global
National

ఇంజినీరింగ్‌కూ ఒకే ఎంట్ర‌న్స్‌..! - ఎంసెట్ త‌ర‌హా ఎంట్ర‌న్స్‌ల‌కు ఇక స్వ‌స్తి..!

గత నెల 18న భువనేశ్వర్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూజీసీ, ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ చైర్మన్లతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు.

ఇంజినీరింగ్‌కూ ఒకే ఎంట్ర‌న్స్‌..! - ఎంసెట్ త‌ర‌హా ఎంట్ర‌న్స్‌ల‌కు ఇక స్వ‌స్తి..!
X

మెడిసిన్ సీట్ల భ‌ర్తీ కోసం దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న `నీట్` త‌ర‌హాలోనే ఇంజినీరింగ్ సీట్ల భ‌ర్తీకి కూడా జాతీయ స్థాయిలో ఒకే ప్ర‌వేశ ప‌రీక్ష‌నిర్వ‌హించే దిశ‌గా కేంద్రం క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ పంపింది. మెజారిటీ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై అవగాహనకు కేంద్రం సెమినార్లు నిర్వహిస్తోంది. జేఈఈ, ఎంసెట్ ప‌రీక్ష‌ల సీజ‌న్ కావ‌డంతో ఈ అంశం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌గా.. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇందులో వ‌చ్చే ర్యాంకుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రాల ప‌రిధిలో ఎంసెట్‌, ఈఏపీసెట్ ఇలా.. సెప‌రేట్‌గా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌గా, వాటిలో ర్యాంకులు వ‌చ్చిన‌వారికి రాష్ట్రాల ప‌రిధిలోని ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల్లో సీట్లు కేటాయిస్తున్నారు. వీటి స్థానంలో ఒకే ప‌రీక్ష విధానం అమ‌లులోకి తేవాల‌ని ఇప్పుడు క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. దీనిపై 2016లోనే ఆలోచన చేసినా వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.

గత నెల 18న భువనేశ్వర్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూజీసీ, ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ చైర్మన్లతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, పొందుపరచాల్సిన నిబంధనలపై వివిధ వాదనలు వినిపించాయి. దీంతో అన్ని కోణాల్లోనూ పరిశీలించి, మార్పుచేర్పులతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐఐటీ గవర్నింగ్ బాడీ చైర్మన్లను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీంతో వారు అన్ని రాష్ట్రాలతో భేటీ అవుతూ అభిప్రాయసేకరణ చేపడుతున్నారు. 2025-26 నాటికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  17 May 2023 11:13 AM IST
Next Story