ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డులు వద్దు- కేంద్రం
సంబంధిత అవార్డులో ఎలాంటి నగదు ప్రోత్సాకం ఉండకూడదు. మరే ఇతర సౌకర్యాల కల్పన ఉండకూడదు. అప్పుడు మాత్రమే అవార్డు స్వీకరణకు ముందస్తు అనుమతి మంజూరు చేస్తారు.
ప్రైవేట్ సంస్థల నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు అవార్డులు తీసుకోవడంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ప్రైవేట్ సంస్థల నుంచి ఏదైనా అవార్డు స్వీకరించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ముందస్తు అనుమతులు కూడా అంత ఈజీ కాదు. సంబంధిత అవార్డులో ఎలాంటి నగదు ప్రోత్సాకం ఉండకూడదు. మరే ఇతర సౌకర్యాల కల్పన ఉండకూడదు. అప్పుడు మాత్రమే అవార్డు స్వీకరణకు ముందస్తు అనుమతి మంజూరు చేస్తారు.
అవార్డు ఇచ్చే సంస్థ విశ్వసనీయతను కూడా పరిశీలిస్తారు. సదరు సంస్థ ఎలాంటి అభియోగాలు, ఆరోపణలు లేనిదై ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డుల స్వీకరణపై ఆంక్షలు ఉన్నప్పటికీ పలువురు అఖిలభారత ఉద్యోగులు అవార్డులను స్వీకరిస్తున్నట్టు ఇటీవల కేంద్రం దృష్టికి వచ్చింది. అవార్డులు ఇవ్వడం ద్వారా కొన్ని సంస్థలు వారిని ఆకర్శిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
దాంతో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని కార్యదర్శులకు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు వెళ్లాయి.