బెంగాల్ హింసపై కేంద్రం ఫోకస్
మరోవైపు పశ్చిమబెంగాల్ హింసాకాండపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఢిల్లీకి చేరుకున్న బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించనున్నారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస ఇంకా చల్లారలేదు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్ రోజు వరకు పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ బూత్‌లను ఆక్రమించి రాజకీయ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రిగ్గింగ్ సాధ్యం కానిచోట్ల బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రత్యర్థి పార్టీలతో గొడవలకు దిగారు. పలుచోట్ల హత్యలు, దహనాలు వంటి దారుణాలు జరిగాయి. ఈ హింసాకాండలో 18 మంది మరణించారు. దీంతో జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య 38కి చేరింది.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో 2.6 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేశారు. 61,636 బూత్‌లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు అంచెల పంచాయతీ వ్యవస్థలో 73,887 స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో 696 బూత్‌లలో పోలింగ్‌ను రద్దు చేసి, ఇవాళ రీపోలింగ్ నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ముర్షీదాబాద్ జిల్లాలో 175, మాల్డాలో 112, నాడియా జిల్లాలో 89, ఉత్తర 24 పరగణాల జిల్లాలో 46, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 36 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది.
బెంగాల్ హింసాకాండపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల తీరును పరిశీలిస్తే భయమేస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలు క్షమించరానివని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మమతా బెనర్జీ ధైర్యసాహసాలను ప్రశంసించే తాను, ఈ పరిణామాలను క్షమించలేనన్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో హింసకు కారణం కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలేనని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొత్తాన్ని రద్దు చేసి, తిరిగి తాజాగా పోలింగ్ జరపాలని బీజేపీ అధ్యక్షుడు జగన్నాథ్ ఛటోపాధ్యాయ డిమాండ్ చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడిందని, బీజేపీ ఎన్నికల ఏజెంట్లపై దాడులు జరిపిందని గవర్నరకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.
మరోవైపు పశ్చిమబెంగాల్ హింసాకాండపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఢిల్లీకి చేరుకున్న బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించనున్నారు. జూలై 8వతేదీన బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్ జిల్లాల్లో హింసాకాండ జరిగింది. హింసాకాండ జరిగిన ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలతో మాట్లాడారు. హింసాకాండకు అధికార పార్టీయే ప్రధాన కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తదపరి చర్యలకు సిద్ధమవుతోంది.
బెంగాల్‌పై పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. అయినా అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీకొట్టలేకపోయింది. దీంతో బెంగాల్‌లో బలం పెంచుకునేందుకు పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది కాషాయ పార్టీ. క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో సత్తా చాటొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. కానీ.. అధికార పార్టీ అదే స్థాయిలో కాషాయ పార్టీకి కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై కేంద్రం దృష్టి సారించింది. మరి కేంద్రం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి.