Telugu Global
National

70 లక్షల మొబైల్‌ నంబర్ల నిలిపివేత..

ఫైనాన్షియల్‌ సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ పేమెంట్లలో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ వివేక్‌ జోషీ సమావేశం నిర్వహించారు.

70 లక్షల మొబైల్‌ నంబర్ల నిలిపివేత..
X

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్‌ నంబర్లలో 70 లక్షల నంబర్లను నిలిపివేసినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం మంగళవారం వెల్లడించింది. డిజిటల్‌ పేమెంట్లలో మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. డిజిటల్‌ లావాదేవీలు భారీగా కొనసాగుతున్న తరుణంలో డిజిటల్‌ మోసాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే అనుమానాస్పద లావాదేవీల కారణంగా వీటిని నిలిపివేసినట్టు తెలిపింది.

ఫైనాన్షియల్‌ సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ పేమెంట్లలో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ వివేక్‌ జోషీ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికాం, ఐటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. డిజిటల్‌ మోసాలు, వాటిని ఎదుర్కోవడంలో తలెత్తుతున్న సవాళ్లకు సంబంధించి ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ ఈ సందర్భంగా ఓ ప్రెజెంటేషన్‌ ఇచ్చింది.

అనంతరం వివేక్‌ జోషీ మాట్లాడుతూ.. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను పటిష్టపరచుకోవాలని సూచించారు. ఆధార్‌ ఆధారిత పేమెంట్లలో మోసాలు, సమాచార భద్రతపై దృష్టిసారించాలని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. వ్యాపారుల కేవైసీ ప్రామాణీకరణ పైనా ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.

First Published:  29 Nov 2023 7:40 AM IST
Next Story