మోసపూరిత లోన్ యాప్‌ల ప్రకటనలు చూపించొద్దు.. ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్‌కు కేంద్రం ఆదేశం
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ను హెచ్చరించింది.
మోసపూరిత లోన్ యాప్‌ల ప్రకటనలను చూపించవద్దని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత వినియోగదారుల అభిరుచుల మేరకు వివిధ రకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి ప్లాట్ ఫామ్స్‌లను స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు.
అయితే స్మార్ట్ ఫోన్లలో ఇటువంటి యాప్‌లను వినియోగించే సమయంలో మోసపూరిత లోన్ యాప్‌ల ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొరపాటున వీటిని క్లిక్ చేస్తే వినియోగదారులు మోసాల బారిన పడుతున్నారు. వీటిపై ఫిర్యాదులు అధికం కావడంతో ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు, యాప్‌లు వారం రోజుల్లోగా మోసపూరిత లోన్ యాప్‌ల ప్రకటనలను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ను హెచ్చరించింది. సోషల్ మీడియా యాప్‌లలో మోసపూరిత ప్రకటనలను ప్రదర్శించకుండా ప్రస్తుతమున్న ఐటీ నిబంధనలను సవరించే పనిలో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
గత నెలలో ప్రభుత్వం నిషేధించిన పలు ఆన్‌లైన్ యాప్‌లలో మోసపూరిత లోన్ యాప్‌లు కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మోసపూరిత లోన్ యాప్ ప్రకటనలను నివారించేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కొన్ని నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.