ఎందుకిలా..? కేంద్రం తెలిసి చేసిందా.. తెలియక చేసిందా..?
తెలంగాణలో 2016లోనే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి వచ్చింది. ఆనాడు పర్యావరణ, అటవీ శాఖ ఇందుకు సంబంధించి జీవో నంబర్ 79ను విడుదల చేసింది.
రాజకీయంగానో.. ప్రభుత్వ వ్యవహారాల పరంగానో.. ఏదో ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం అన్నట్టుగా పరిస్థితులు తయారవుతున్నాయి. తాజాగా.. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై పార్లమెంట్‌లో కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం చెప్పిన సమాధానం.. మరో వివాదాన్ని రాజేసినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై నిషేధం లేదంటూ కేంద్రం లిఖితపూర్వకంగా పార్లమెంట్ లో చెప్పడంపై.. విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలు వాస్తవం ఏంటంటే.. తెలంగాణలో 2016లోనే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి వచ్చింది. ఆనాడు పర్యావరణ, అటవీ శాఖ ఇందుకు సంబంధించి జీవో నంబర్ 79ను విడుదల చేసింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లు తయారీతో పాటు.. అమ్మకాలు, కొనుగోళ్లపైనా నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై 5 వేల రూపాయల వరకు ఫైన్ కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఉత్తర్వుల అమలు కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత.. ఈ నిషేధాన్ని మరింత పటిష్టపరిచింది తెలంగాణ ప్రభుత్వం. 2021 సెప్టెంబర్ లో 75 మైక్రాన్ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్ పై, తర్వాత 2022 జూలైలో 100 మైక్రాన్ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్ పై.. ఆ తర్వాత డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్ల మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని విధిస్తూ వచ్చింది. ఇంత చేసినా ఈ ఉత్తర్వులను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నా.. కేంద్రం ఇలా పార్లమెంట్ లో ఎందుకు చెప్పింది అన్నదే.. అయోమయానికి, తాజా వివాదానికి కారణంగా నిలుస్తోంది.
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వ్యవహారానికి సంబంధించి లోక్ సభలో కేంద్రం ఇలా చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు తెలిసి ఇలా చెప్పారా..? లేదంటే సమాచార లోపమా..? అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారు.. బీఆర్ఎస్ నేతలు ఎలా తిప్పికొడతారు అన్నది.. మున్ముందు చూడాల్సిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి వ్యవహారాలు తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించడం తప్పదన్న విషయం స్పష్టమవుతోంది.