Telugu Global
National

మహిళా ఉద్యోగుల పింఛనుపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మహిళలకు సమాన హక్కులు కల్పించినట్లవుతుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.

మహిళా ఉద్యోగుల పింఛనుపై కేంద్రం కీలక నిర్ణయం
X

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పింఛనుదారులు తమ మరణానంతరం వచ్చే ప్రయోజనాలను పొందేందుకు నామినీగా ఇకపై భర్త పేరుకు బదులు తమ కుమారుడు లేదా కుమార్తె పేరు నామినేట్‌ చేసే అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పటివరకు మహిళా ఉద్యోగి లేదా పింఛనుదారు తన తదనంతరం కుటుంబ పింఛనును తన భర్తకు, అతడి మరణానంతరం పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించేవారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్‌ చెల్లించడానికి వీలుగా 2021 నాటి కేంద్ర పౌర సర్వీసుల (కుటుంబ పింఛన్‌) నిబంధనలను కేంద్ర పింఛన్, పింఛనుదారుల సంక్షేమ విభాగం సవరించింది.

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మహిళలకు సమాన హక్కులు కల్పించినట్లవుతుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్న సందర్భాలతో పాటు గృహ హింస నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద కేసులు దాఖలైన సందర్భాల్లోనూ పింఛను చెల్లింపులో తలెత్తే సమస్యలను తాజా సవరణ ద్వారా పరిష్కరించడం సులభమవుతుందని మంత్రి వివరించారు.

రాతపూర్వక దరఖాస్తు తప్పనిసరి...

కేంద్రం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే మహిళా ఉద్యోగి తాను పనిచేసే విభాగం ఇన్‌చార్జికి రాతపూర్వక దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. ఆమె తదనంతరం అది అమలులోకి వస్తుంది. ఇక పిల్లలు లేని సందర్భాల్లో భర్తకే పింఛన్‌ అందుతుంది. కుమార్తె లేక కుమారుడు మైనర్‌ అయినా, మానసిక వైకల్యంతో బాధపడుతున్నా వారి సంరక్షకుడైన తండ్రి (భర్త)కి పింఛన్‌ చెల్లిస్తారు. సదరు కుమార్తె లేక కుమారుడు మేజర్‌ అయిన తరువాత వారికే పింఛన్‌ లభిస్తుంది. మహిళా పింఛనుదారు మరణిస్తే ఆమె భర్త సజీవంగా ఉన్నా, పిల్లలు మేజర్‌ అయితే వారికే పింఛను అందుతుంది. ఈ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగి లిఖితపూర్వక దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

First Published:  30 Jan 2024 10:53 AM IST
Next Story