Telugu Global
National

ఆ జవాబు చెప్పడానికి రెండేళ్లు పట్టింది..

డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు మొత్తం రూ. 38 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పింది. బస, భోజనం, భద్రత ఏర్పాట్లతో పాటు విమానాలు, రవాణా ఖర్చుల కోసం రూ. 38 లక్షలు అయ్యాయని పేర్కొన్నది.

ఆ జవాబు చెప్పడానికి రెండేళ్లు పట్టింది..
X

ప్రపంచమంతా కరోనా భయాందోళనలు నెలకొంటున్న సమయంలో భారత ప్రభుత్వం అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు నానా హంగామా చేసింది. 2020 ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ కేవలం 36 గంటలు ఇండియాలో పర్యటించారు. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్‌లో 22 కిలోమీటర్ల రోడ్ షో, మొతేరా స్టేడియంలో లక్ష మందితో 'నమస్తే ట్రంప్' కార్యక్రమాలు నిర్వహించింది. అహ్మదాబాద్‌లోని మురికి వాడలు కనిపించకుండా అక్కడి ప్రభుత్వం అప్పటికప్పుడు రోడ్ల పక్కన గోడలు నిర్మించింది. అమెరికా అధ్యక్షుడి కోసం ఇంత ఖర్చు అవసరమా అనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మిషల్ భతేనా అనే వ్యక్తి 2020 అక్టోబర్‌లో ఆర్టీఐ దరఖాస్తు చేశాడు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలంటూ అతను కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. కానీ ఆయనకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌ను ఆశ్రయించాడు. తాను డొనాల్డ్ ట్రంప్ పర్యటన‌కు అయిన ఖర్చు గురించి అడిగితే సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. దీంతో సమాచార కమిషన్ వెంటనే ఆయన దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీఐసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 4న విదేశాంగ శాఖ సమాధానం ఇచ్చింది.

డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు మొత్తం రూ. 38 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పింది. బస, భోజనం, భద్రత ఏర్పాట్లతో పాటు విమానాలు, రవాణా ఖర్చుల కోసం రూ. 38 లక్షలు అయ్యాయని పేర్కొన్నది. కోవిడ్ కారణంగా జవాబు ఇవ్వడంలో ఆలస్యమైందని కూడా వివరించింది. ఈ సమాధానం చూసి దరఖాస్తుదారుడు ఆశ్చర్యపోయాడు. భారీ ఏర్పాట్లు, విమానాలు, రవాణా ఖర్చులకు కేవలం రూ. 38 లక్షలు కావడం ఏంటని విస్మయం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని మీడియాకు చెప్పాడు.

డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా, కుమార్త్ ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తో పాటు అమెరికా అధికారులు అందరూ అహ్మదాబాద్, ఆగ్రా సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం వీళ్ల రాక కోసం భారీ ఏర్పాట్లు చేయడంతో పాటు పత్రిక, టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది. వీటన్నింటికీ వందల కోట్లు ఖర్చు పెట్టిందనే చర్చ కూడా జరిగింది. కానీ అంత హంగామాకు అయ్యింది రూ. 38 లక్షలే అని.. అది కూడా రెండేళ్ల తర్వాత తీరిగ్గా సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆర్టీఐకి సమాధానం చెప్పడంలో ఉన్న లొసుగులన్నింటినీ ఉపయోగించుకొని రెండేళ్ల పాటు ఆలస్యం చేసింది. అందుకు కోవిడ్ అనే కారణాన్ని చూపింది. ఇక ఇప్పటికైనా సమాధానం ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందనే.. ఇలా సమాధానం ఇచ్చి చేతులు దులిపేసుకుందనే విమర్శలు వస్తున్నాయి.

First Published:  19 Aug 2022 8:25 AM IST
Next Story