Telugu Global
National

ఎలక్ట్రిక్ బైక్ కంపెనీలకు కేంద్రం కొత్త నిబంధనలు..

భద్రతా ప్రమాణాల ప్రకారం.. ఛార్జింగ్ చేసే సమయంలో ఆటో కటాఫ్ ఫీచర్ లేకపోతే ఆ కంపెనీల స్కూటర్లు మార్కెట్‌లోకి రాకుండా నిషేధిస్తామని హెచ్చరించింది.

ఎలక్ట్రిక్ బైక్ కంపెనీలకు కేంద్రం కొత్త నిబంధనలు..
X

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల వరుస ప్రమాదాలకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ కారణాలు వెదికి పట్టుకుంది. ఇప్పటికే నాసిరకం బ్యాటరీలతో ప్రజల ప్రాణాలు తీసిన మూడు కంపెనీలకు భారీ జరిమానా విధించడంతోపాటు, సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం, కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఇకపై ఎలక్ట్రిక్ టూ వీలర్ల కంపెనీలన్నీ ఈ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాల ప్రకారం.. ఛార్జింగ్ చేసే సమయంలో ఆటో కటాఫ్ ఫీచర్ లేకపోతే ఆ కంపెనీల స్కూటర్లు మార్కెట్‌లోకి రాకుండా నిషేధిస్తామని హెచ్చరించింది.

ఇటీవల ఊరూ పేరూ లేని చైనా స్కూటర్లను దిగుమతి చేసుకుని వాటికి అందమైన స్టిక్కరింగ్ వేసి ఇండియాలో అమ్మేస్తున్నారు. తక్కువ రేటుకి వచ్చే ఈ స్కూటర్లతో వ్యాపారులు భారీగా లాభాలు పొందుతున్నారు. కానీ వీటిల్లో బ్యాటరీ సమస్య ప్రముఖంగా కనిపిస్తోంది. గతంలో యాసిడ్ బ్యాటరీలు వాడే సమయంలో ఎలాంటి సమస్యలు రాలేదు కానీ, లిథియం అయాన్ బ్యాటరీల కాలం వచ్చే సరికి ఆటో కటాఫ్ ఫీచర్ లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. నిర్ణీత సమయానికి మించి చార్జింగ్ పెడితే ఆ బ్యాటరీలు తట్టుకోలేవు. అందుకే కాలిపోతున్నాయి. ప్రయాణంలో తగలబడుతున్న స్కూటర్ల విషయంలో కూడా నాసిరకం బ్యాటరీల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర బృందం తేల్చింది. దీంతో బ్యాటరీల విషయంలో కేంద్రం నిబంధనలు కఠినతరం చేస్తోంది.

కార్లతో సమస్య లేనట్టేనా..?

ఇటీవల ఎలక్ట్రిక్ కార్లు, ఆటోలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మార్కెట్లోకి వస్తున్నాయి. వాటితో చార్జింగ్ సమస్య ఉన్నట్టు ఎక్కడా బయటపడలేదు. ఎక్కడా కార్లు, ఆటోలు పేలిపోవడం కానీ, షార్ట్ సర్క్యూట్ కావడం కానీ జరగలేదు. కేవలం స్కూటర్ల విషయంలోనే ఈ సమస్యలొచ్చాయి. తమిళనాడు వెల్లూరులో ఓ కుటుంబం అగ్నికి ఆహుతవడం ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రమాద తీవ్రతను తెలియజేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల అమ్మకాలు తగ్గిపోయాయి. పేరుగొప్ప కంపెనీలు కూడా తమ వాహనాలను రీకాల్ చేశాయి. కేంద్రం కొత్త నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగే అవకాశముంది. అయితే ఆ నిబంధనలతో, స్కూటర్ విడిభాగాల నాణ్యత పెరగాల్సి రావడంతో.. సహజంగానే రేటు కూడా పెరిగే అవకాశముంది.

First Published:  14 Aug 2022 2:21 AM GMT
Next Story