Telugu Global
National

హీరో విశాల్ ఆరోపణలు.. విచారణకు కేంద్రం ఆదేశం

తన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని హిందీ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు CBFC ముంబై ఆఫీసులో లంచం తీసుకున్నారని ఆరోపించారు.

హీరో విశాల్ ఆరోపణలు.. విచారణకు కేంద్రం ఆదేశం
X

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌పై తమిళ నటుడు విశాల్‌ చేసిన అవినీతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంపై విచారణ జరిపేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ఓ సీనియర్ అధికారిని ముంబైకి పంపించినట్లు తెలిపింది. ఈ మేరకు విశాల్‌ ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని.. ఇది అత్యంత దురదృష్టకరమంటూ ట్వీట్ చేసింది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. ఈ ప్రభుత్వం అవినీతిని ఏ మాత్రం సహించదని.. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

గురువారం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సర్టిఫికేషన్‌ ముంబై ఆఫీసుపై హీరో విశాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని హిందీ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు CBFC ముంబై ఆఫీసులో లంచం తీసుకున్నారని ఆరోపించారు. విడుదల తేదీ దగ్గర పడటంతో చేసేదేమీ లేక తాను రూ.6.5 లక్షలు లంచం ఇచ్చానని ఆరోపించారు విశాల్‌. ఇలాంటి పరిస్థితి భవిష్యత్‌లో ఏ నిర్మాతకు రాకూడదనే ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.


మొత్తం రూ.6.5 లక్షలను రెండు విడతల్లో చెల్లించినట్లు చెప్పారు విశాల్‌. మొదటి విడతలో ఎం.రాజన్ అనే వ్యక్తికి 3 లక్షలు, రెండో విడతలో జిజా రామ్‌దాస్‌ అనే వ్యక్తికి రూ.3.5 లక్షలు చెల్లించినట్లు చెప్పారు. వారి బ్యాంకు ఖాతాల వివరాలను సైతం ట్విట్టర్‌లో పోస్టు చేశారు విశాల్‌. జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని కోరారు.

First Published:  29 Sept 2023 3:18 PM IST
Next Story