Telugu Global
National

మళ్లీ కోవిడ్‌ కలకలం.. - రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

రానున్నవి పండుగల సీజన్‌లు కావడంతో కోవిడ్‌ విస్తరించకుండా కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

మళ్లీ కోవిడ్‌ కలకలం.. - రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం
X

దేశంలో కోవిడ్‌ కలకలం మళ్లీ మొదలైంది. కేరళలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ప్రభావంతో ఇప్పటికే ఐదుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారంతా కేరళ రాష్ట్రానికి చెందినవారే. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్‌–19 కేసులు పెరగడం, కేరళలో కొత్త సబ్‌ వేరియంట్‌ వెలుగు చూడటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అలర్ట్‌ చేసింది. ఈ మేరకు సోమవారం పలు సూచనలు జారీ చేసింది.

రానున్నవి పండుగల సీజన్‌లు కావడంతో కోవిడ్‌ విస్తరించకుండా కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం ప్రయాణాలు చేయడం, కుటుంబ సభ్యులంతా ఒకేచోటకు చేరడం, షాపింగ్‌లు పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తప్పనిసరని కేంద్రం స్పష్టంచేసింది. గతంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలే మరోసారి తీసుకోవాలని తెలిపింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని సూచించింది.

కరోనా వైరస్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు ఇటీవల కేరళలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. భారత్‌ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ గుర్తించినట్టు ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను హెచ్చరించింది. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని తెలిపింది.

కట్టడి చర్యల్లో భాగంగా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని, ఆయా ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉన్న వేరియంట్‌ ఏమిటనేది తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్స్‌ టెస్టులు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ చేపడుతున్న మాక్‌ డ్రిల్స్‌లో భాగస్వామ్యం కావాలని, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సంసిద్ధతలను పరీక్షించనున్నట్టు వివరించింది.

First Published:  19 Dec 2023 8:33 AM IST
Next Story