భూటాన్ నుంచి దిగుమతులు.. భారత వక్క రైతుల దిగాలు..
నిబంధనలు సడలించారు. కనీస ధర ఎత్తేశారు. దీంతో ఇప్పటికే 17వేల టన్నుల పచ్చి వక్క భూటాన్ నుంచి భారత మార్కెట్లోకి దిగుమతి అయింది. ఈ పరిణామం దేశీయ రైతులకు మింగుడుపడటంలేదు.
భారత్ లో వక్క రైతులను కష్టాలపాలు చేసే నిర్ణయం తీసుకుంది కేంద్రం. భూటాన్ నుంచి వక్క దిగుమతులకు ఎడాపెడా అనుమతులిచ్చేసింది. గతంలో దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ, కనీస ధర కిలోకు 251 రూపాయలుగా నిర్ణయించారు. కానీ, ఇప్పుడా నిబంధనలు సడలించారు. కనీస ధర ఎత్తేశారు. దీంతో ఇప్పటికే 17వేల టన్నుల పచ్చి వక్క భూటాన్ నుంచి భారత మార్కెట్లోకి దిగుమతి అయింది. ఈ పరిణామం దేశీయ రైతులకు మింగుడుపడటంలేదు. ముఖ్యంగా కర్నాటక రైతులు దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.
గతంలో పట్టు, ఇప్పుడు వక్క..
గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే బైవోల్టిస్ పట్టుపై వాజ్ పేయి హయాంలో దిగుమతి సుంకాన్ని 30నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో ఇబ్బడి ముబ్బడిగా పట్టుని దిగుమతి చేసుకున్నారు. కర్నాటక, ఏపీ, తమిళనాడులోని రైతులు దీనివల్ల తీవ్రంగా నష్టపోయారు. ఆయా రాష్ట్రాల్లో మల్బరీ తోటల పెంపకం, పట్టు దిగుబడి రెండూ తగ్గిపోయాయి. దేశీయ పట్టు పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లిపోవడానికి ఆనాడు తీసుకున్న నిర్ణయమే కారణం. భారత్ లో ఉత్పత్తి తగ్గిపోయిందని తెలిశాక, చైనా రేట్లు పెంచేసింది. అంతిమంగా భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పెరిగింది. గుజరాత్ లోని కొంతమంది పట్టు వ్యాపారులు అప్పట్లో భారీగా లాభపడ్డారు.
ఇప్పుడు అదే పద్ధతిలో వక్కని కూడా భూటాన్ నుంచి దిగుమతి చేసుకోడానికి ప్రభుత్వం గేట్లు ఎత్తేసింది. భారీ ఎత్తున వక్క దిగుమతి అయితే, దేశీయంగా వక్క పంట విస్తీర్ణం తగ్గిపోతుంది. రైతులు ప్రత్యామ్నాయాలవైపు మొగ్గు చూపుతారు. ఆ తర్వాత భూటాన్ రేటు పెంచితే, చేయగలిగిందేమీ లేదు. ముందుచూపు లేకపోవడం వల్లే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడుతున్నారు రైతులు.
దేశంలో 8 నుంచి 10 లక్ష టన్నుల వక్కలు పండుతున్నాయి. దేశీయ అవసరాలకంటే ఇది ఎక్కువే. అదే సమయంలో మిగిలిన వక్కలను ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్లలో పంట దిగుబడి 15 లక్షల టన్నులకు చేరవచ్చని అంచనా. ఈ దశలో భూటాన్ లాంటి దేశాలనుంచి వక్క దిగుమతులను ప్రోత్సహిస్తే అది కచ్చితంగా దేశీయ వ్యాపారాన్ని దెబ్బతీస్తోందని వాపోతున్నారు రైతులు. వెంటనే దిగుమతులు ఆపేయాలని, ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.