అస్మదీయుడికి వీరతాడు.. ఈడీ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు
2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ కుమార్ మిశ్రాకు ఏడాదిపాటు సర్వీసు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. అంటే ఆయన మొత్తం ఐదేళ్లు ఈ పదవిలో ఉంటారన్నమాట.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించింది కేంద్రం. తమకు అనుకూలంగా ఉంటే, తమకి నచ్చినట్టు పనిచేస్తే, అస్మదీయుడు అనిపించుకుంటే కేంద్రం ఇలాంటి వీరతాళ్లు వేయడానికి ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మిశ్రా వ్యవహారం మరింత స్పెషల్. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు ఓసారి పదవీకాలం పొడిగించారు. ఇది రెండోసారి.
వాస్తవానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ఉన్నవారు రెండేళ్లపాటు మాత్రమే దానికి అధిపతిగా ఉండాలి. కానీ సంజయ్ కుమార్ మిశ్రా కోసం ఆ నియమాన్ని మార్చేశారు. రెండేళ్ల తర్వాత మరో మూడేళ్లు కొనసాగేలా ఏకంగా ఆర్డినెన్స్ తెచ్చారు. 2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ కుమార్ మిశ్రాకు మరోసారి ఏడాదిపాటు సర్వీసు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. అంటే ఆయన మొత్తం ఐదేళ్లు ఈ పదవిలో ఉంటారన్నమాట.
మిశ్రా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) 1984-బ్యాచ్ అధికారి. విదేశీ పన్నుల ఇన్‌ఛార్జ్ జాయింట్ సెక్రటరీ సహా పలు ఇతర విభాగాల్లో కీలక పదవులు నిర్వహించారు. సంజయ్ ఈరోజు(2022 నవంబర్-18)న పదవీ విరమణ చేయాల్సి ఉంది. సరిగ్గా ఒకరోజు ముందు అంటే నిన్న (నవంబర్ -17)న ఆయన పదవీకాలం ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. కేబినెట్ కమిటీ ఆన్ అపాయింట్ మెంట్ (ACC) ఈ పొడిగింపు ఉత్తర్వులపై ఆమోదముద్ర వేసింది.
ప్రతిపక్షాలను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న అస్త్రాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఒకటి. గతంలో కాంగ్రెస్ హయాంలో సీబీఐని పంజరంలో చిలక అన్నోళ్లే, ఇప్పుడు ఆ చిలకకు తోడుగా ఈడీ, ఐటీ విభాగాలను కూడా తెచ్చిపెట్టారు. ఇప్పుడు పరిస్థితి మరింత ఘోరం. సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు కేంద్రం ఉస్కో అనగానే పరిగెత్తుకుంటూ దాడులకు వస్తున్నాయని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ మధ్య ఈ లిస్ట్ లోకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం ఆరోపణలు కాదు, వాస్తవాలు అని పదే పదే ఆయా సంస్థలు చేసే దాడులు రుజువు చేస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించేవారు, బీజేపీ ఎదుగుదలకు అడ్డుతగులుతున్నవారు.. కచ్చితంగా ఈ సంస్థలకు టార్గెట్ గా మారుతున్నారు. ఈ టార్గెట్ ని మరింత సమర్థంగా నిర్వహించినందుకే కాబోలు.. ఇప్పుడు ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించారు.