Telugu Global
National

తెలంగాణ, ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!

దేశ వ్యాప్తంగా రైల్వే లైన్ల విస్తరణతో పాటు, రైళ్ల రాకపోకలు మరింత సమర్థంగా నిర్వహించడం, రద్దీకి అనుగుణంగా సేవలు అందించండం వంటి లక్ష్యాలతో కేంద్రం తాజా నిర్ణయాలు తీసుకుంది.

తెలంగాణ, ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!
X

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే లైన్ల విస్తరణ పనుల విషయంలో మోడీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద‌ముద్ర వేసింది. ఏపీలోని గుంటూరు నుంచి తెలంగాణలోని బీబీనగర్ వరకు ఉన్న రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు అంగీకారం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖంఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రైల్వే నెట్ వర్క్ ను విస్తరించేందుకు సైతం అంగీకారాన్ని వ్యక్తం చేసింది కేంద్ర కేబినెట్.

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గుంటూరు - బీబీనగర్ రైల్వే లైన్ డబ్లింగ్ కు 3,238.38 కోట్ల రూపాయల ఖర్చును అంచనాగా వేసిన కేంద్రం.. ఈ రూట్ లో 272 కిలోమీటర్ల మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు నిర్ణయించింది. అలాగే విజయనగరం - కుర్దారోడ్, బారాంగ్ - నెర్గుండి మార్గంలో మూడో రైల్వే లైన్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. 417 కిలోమీటర్ల మేర చేయనున్న ఈ పనులకు 5,618.26 కోట్ల రూపాయలను అంచనా వేసింది.

డోన్ - మహబూబ్ నగర్, మేడ్చల్ - ముద్కేఢ్ మధ్య 502 కిలోమీటర్ల మార్గాన్ని సైతం డబ్లింగ్ చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ పనులకు 5,655.40 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. ఓవరాల్‌గా 9 రాష్ట్రాల్లో 7 మల్టీ ట్రాకింగ్ పనులను ఓకే చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఖరారు చేసింది.

దేశ వ్యాప్తంగా రైల్వే లైన్ల విస్తరణతో పాటు, రైళ్ల రాకపోకలు మరింత సమర్థంగా నిర్వహించడం, రద్దీకి అనుగుణంగా సేవలు అందించండం వంటి లక్ష్యాలతో కేంద్రం తాజా నిర్ణయాలు తీసుకుంది. ఈ పనులకు మొత్తంగా 32,500 కోట్ల రూపాయల నిధులను కేటాయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు - బీబీనగర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పూర్తయితే.. ఏపీ, తెలంగాణ మీదుగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ మార్గాల్లో ప్రయాణికుల రవాణాతో పాటుగా వస్తు రవాణా సేవలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.

First Published:  16 Aug 2023 3:04 PM GMT
Next Story