చక్కెర ఎగుమతులపై నిషేధం.. ఈసారి ఏకంగా ఏడాదిపాటు
గోధుమల ఎగుమతులపై కూడా కేంద్రం నిషేధం కొనసాగిస్తోంది. తాజాగా చక్కెరపై విధించిన నిషేధం ఏకంగా ఏడాదిపాటు కొనసాగించడం దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందనడానికి ప్రధాన సంకేతంగా చెబుతున్నాయి ప్రతిపక్షాలు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏదీ అక్కర్లేదు. తమకు సరిపోను మిగులు పంట పండించే దేశాలన్నీ ఎగుమతులతో ఆదాయాన్ని ఆర్జిస్తుంటాయి. కానీ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి, ప్రజలకు ఆర్థిక కష్టాలు మొదలైతే ఆ మిగులు పంటను కూడా దాచుకోడానికే ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఆదాయం సంగతి పక్కనపెట్టి, ముందు దేశీయ అవసరాలు తీర్చాలనుకుంటోంది. కృత్రిమంగా ధరలు నియంత్రిస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోంది. చక్కెర ఎగుమతులపై మరోసారి నిషేధం విధించింది.
చక్కెర ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర ధరలను నియంత్రించడం కోసం ఎగుమతులపై ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు వరకు తొలి విడత నిషేధం విధించింది కేంద్రం. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తుండటంతో ఆంక్షలను మరో ఏడాదిపాటు పొడిగించింది. 2023 అక్టోబర్ వరకు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశంలో చక్కెర ధరలను నియంత్రించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
గోధుమలు కూడా...
గోధుమల ఎగుమతులపై కూడా నిషేధం కొనసాగిస్తోంది. తాజాగా చక్కెరపై విధించిన నిషేధం ఏకంగా ఏడాదిపాటు కొనసాగించడం దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందనడానికి ప్రధాన సంకేతంగా చెబుతున్నాయి ప్రతిపక్షాలు. వాస్తవానికి ఈ ఏడాది దేశంలో చెరకు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. 8 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయవచ్చని ప్రభుత్వం, వ్యాపార వర్గాలు ఈ నెల మొదటివారంలో వెల్లడించాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చక్కెర ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రూపాయి విలువ తగ్గిపోవడంతో దిగుమతులు మరింత భారంగా మారుతున్నాయి. ఈ దశలో తక్షణ చర్యలు చేపట్టాల్సిన కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనడంపై పెట్టిన శ్రద్ధ.. దేశ ఆర్థిక విధానాలపై పెడితే బాగుంటుందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.