ఎన్నికల్లో బ్యాలెట్ విధానానికి కేంద్రం నో
బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలంటూ కొన్ని విజ్ఞప్తులు వస్తున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారని కేంద్రమంత్రి వివరించారు.
ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ విధానంలోకి వెళ్లి ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా కాలంగా ఎన్నికల్లో బ్యాలెట్‌ల స్థానంలో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాలెట్ విధానంలోకి వెళ్లే అంశంపై ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలంటూ కొన్ని విజ్ఞప్తులు వస్తున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారని కేంద్రమంత్రి వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం 1982 నుంచి ఈవీఎంలను వినియోగించే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వినియోగాన్ని స్పష్టమైన నిబంధనల ద్వారా పార్లమెంటు చట్టబద్ధంగా ఆమోదించిందని తెలిపారు. ఈవీఎంల వినియోగానికి సంబంధించిన చట్టంపై గతంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్థాయిలో న్యాయసమీక్ష జరిగిందని కేంద్రమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.