జమిలి ఎన్నికలు పెడితే ఖర్చు జస్ట్ రూ.10 లక్షల కోట్లే!
లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే రూ.10 లక్షల కోట్లు ఖర్చువుతాయని సంస్థ విశ్లేషకుడు ఎన్.భాస్కర్‌రావు చెప్పారు.
సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. `వన్ నేషన్- వన్ ఎలక్షన్` పేరిట లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఒకేసారి నిర్వహించాలని యోచిస్తోంది. దీనికి చాలా అడ్డంకులున్నప్పటికీ అసలు ఒకేసారి ఎన్నికలు ఎందుకు..? దానివల్ల లాభనష్టాలేంటి అనే విశ్లేషణలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ అనే సంస్థ దేశంలో పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహిస్తే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రకటించింది.
ఏ ఎన్నికలకు ఎంత ఖర్చంటే..?
లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే రూ.10 లక్షల కోట్లు ఖర్చువుతాయని సంస్థ విశ్లేషకుడు ఎన్.భాస్కర్‌రావు చెప్పారు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు మాత్రమే కాదట. పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారం కోసం చేసే ఖర్చు కూడా ఇందులోనే ఉదంట. లోక్‌సభ ఎన్నికలకు రూ.1.20 లక్షల కోట్లు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ (4,123 సీట్లు) ఎన్నికలకు రూ.3 లక్షల కోట్లు, అన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు రూ. 1లక్ష కోట్లు, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు పెట్టాలంటే రూ.4.30 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని సంస్థ స్టడీలో తేలిందని ఆయన వివరించారు.
తాయిలాల మాటేంటి?
ఇదంతా ఎన్నికల నిర్వహణ, పార్టీల ప్రచార ఖర్చు అని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ చెబుతోంది. కానీ, దేశంలో జరిగే ఎన్నికల్లో ఎంత డబ్బును ఓటర్లకు పంచిపెడతారు..? ఎన్ని తాయిలాలు ఇస్తారు? ఎంత మందు పోస్తారు? ఇది ముఖ్యం. ఆ తాయిలాలకు ఎంత కావాలి అనేది కూడా లెక్కేస్తే రూ.10 లక్షల కోట్లు కూడా చాలవేమో అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.