సెల్ ఫోన్ తీసిన ప్రాణాలు 1040.. గుంతల వల్ల మరణాలు 1484
2021లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1997 మంది చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. 1040మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మరణించారు.
రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమే ప్రధాన కారణం అంటారు. ఆ నిర్లక్ష్యం వాహనదారుడిదే కావాల్సిన అవసరం లేదు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ది కావొచ్చు, ఆ రోడ్డుపై గుంతలు సకాలంలో పూడ్చాలన్న ఇంగితం లేని అధికారులది, మరమ్మతులకు నిధులివ్వని ప్రభుత్వాలది కూడా కావొచ్చు. 2021లో ఇలా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన వారి సంఖ్య 1484. రోడ్లపై గుంతల కారణంగా దేశవ్యాప్తంగా 2021లో 3625 ప్రమాదాలు జరిగాయని, ఆ ప్రమాదాల్లో 1484 మంది చనిపోయారని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ తెలిపింది. రోడ్ యాక్సిండెంట్స్ ఇన్ ఇండియా- 2021 పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలున్నాయి. మరి గుంతల కారణంగా జరిగిన ప్రమాదాలకు ప్రభుత్వం బాధ్యత వహించిందా లేదా అనేది మాత్రం చెప్పలేదు.
చంపేస్తున్న సెల్ ఫోన్లు..
సెల్ ఫోన్ అతిగా వాడితే ప్రమాదమని అందరికీ తెలుసు. అందులోనూ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు వాడితే అత్యంత ప్రమాదకరం. నడుస్తున్నా, కూర్చున్నా, తింటున్నా... చివరకు బాత్రూమ్ లో ఉన్నా కూడా సెల్ ఫోన్ ని ఎవరూ వదిలిపెట్టడం లేదు. అలాంటిది బైక్ పై కూర్చున్నా, కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా ఎందుకు వదిలిపెడతారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడాలని ప్రయత్నించడం, మెసేజ్ చేయాలని చూడటం.. ప్రాణాంతకమైన పనులు. అలాంటి సాహసాలు చేసి ఏకంగా 1040మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మరణించారు. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1997 మంది చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. కేవలం సెల్ ఫోన్ల వల్లే 1997 ప్రమాదాలు జరిగాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.
సిగ్నల్ జంపింగ్ వల్ల ప్రమాదాలు..
సిగ్నల్ జంపింగ్ చేస్తే చలానా పడుతుందని అందరికీ తెలుసు. కానీ అలాంటి తప్పుల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా ముందుకెళ్తే.. మిగతా వాళ్లు కచ్చితంగా డిస్ట్రబ్ అవుతారు. రెడ్ సిగ్నల్ జంపింగ్ వల్ల 2021లో 555 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఈ దుర్ఘటనల్లో 222 మంది మృతి చెందారు. 2021లో మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది గాయపడ్డారు.