Telugu Global
National

శిశువుల విక్రయ ముఠా గుట్టురట్టు.. - ప్రముఖ ఆస్పత్రుల్లోని వైద్యులకూ లింక్‌

పేదరికంలో మగ్గుతున్న మహిళలే ఈ ముఠాకు టార్గెట్‌. వారి దయనీయ పరిస్థితిని వీరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారికి పుట్టిన బిడ్డలను డబ్బు ఆశ చూపి కొనుగోలు చేస్తున్నారు.

శిశువుల విక్రయ ముఠా గుట్టురట్టు.. - ప్రముఖ ఆస్పత్రుల్లోని వైద్యులకూ లింక్‌
X

శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాతో చెన్నైలోని నాలుగు ప్రముఖ ఆస్పత్రుల్లోని డాక్టర్లకు కూడా లింక్‌ ఉందని వెల్లడైంది. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ దయానంద్‌ మంగళవారం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని 4 ఆస్పత్రులు, డాక్టర్లు, బెంగళూరులోని ఓ మహిళ కలిసి ఈ ముఠాను నడుపుతున్నారు. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా నలుగురు నిందితులను బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కన్నన్‌ రామస్వామి, మురుగేశ్వరి, హేమలత, శరణ్యగా గుర్తించారు.

పేదరికంలో మగ్గుతున్న మహిళలే ఈ ముఠాకు టార్గెట్‌. వారి దయనీయ పరిస్థితిని వీరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారికి పుట్టిన బిడ్డలను డబ్బు ఆశ చూపి కొనుగోలు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 3 నెలల పసికందు వరకు వీరి టార్గెట్‌. ఒక్కో చిన్నారిని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది చిన్నారులను ఈ ముఠా వివిధ చోట్ల విక్రయించినట్లు తెలుస్తోంది. ఇతరులకు అనుమానం రాకుండా నిందితులు చిన్నారులను కార్లలోనే రవాణా చేస్తుండటం గమనార్హం.

పట్టుబడిందిలా..

సోమవారం రాత్రి 20 రోజుల మగ శిశువును విక్రయ ముఠా నుంచి పోలీసులు రక్షించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు సిటీ సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ముగ్గురు మహిళలు ఓ చిన్నారితో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. దీనివెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాలను ఆరా తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

First Published:  29 Nov 2023 7:58 AM IST
Next Story