Telugu Global
National

ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రిని సిబిఐ రేపు అరెస్టు చేస్తుందా..!?

ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాను సిబిఐ రేపు అరెస్టు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. సోమ‌వారంనాడు ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని మ‌నీష్ సిసోడియాకు సిబిఐ స‌మ‌న్లు జారీ చేసింది.

ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రిని సిబిఐ రేపు అరెస్టు చేస్తుందా..!?
X

ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాను సిబిఐ రేపు అరెస్టు చేస్తుందా ..? అందుకే ఆయ‌న‌కు తాజాగా స‌మ‌న్లు జారీ చేసిందా? అంటే అవున‌ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత‌లు చెబుతున్నారు. వివాదాస్ప‌ద ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసులో సోమ‌వారంనాడు ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని మ‌నీష్ సిసోడియాకు సిబిఐ స‌మ‌న్లు జారీ చేసింది.

దీనిపై ఆప్‌పార్టీ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. సిసోడియాను రేపు అరెస్టు చేస్తారని పేర్కొన్నారు, ఈ సమన్లు ​​రాబోయే గుజరాత్ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని ఆరోపించారు. ఇక్కడ బిజెపి, ఆప్ మ‌ధ్య ప్రత్యక్ష పోటీ జ‌రుగుతోంద‌ని అన్నారు. అందుకే బీజేపీకి భయం పట్టుకుంది అని భ‌ర‌ద్వాజ అన్నారు.

తాజా సమన్లపై సిసోడియా స్పందిస్తూ, ఇంతకుముందు "సిబిఐ నా ఇంటిపై 14 గంటలు దాడి చేసింది, దాడుల్లో ఏమీ బయటపడలేదు, వారు నా బ్యాంక్ లాకర్‌ను వెతికారు, ఏమీ కనుగొనలేదు, వారికి మా గ్రామంలో ఏమీ కనుగొనబడలేదు. ఇప్పుడు రేపు ఉదయం 11 గంటలకు నన్ను సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిచారు. నేను వెళ్లి పూర్తి సహకారం అందిస్తాను'' అని హిందీలో ట్వీట్ చేశారు.

ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన డిప్యూటీ సిసోడియాను స‌మర్థించారు, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్‌తో పోల్చుతూ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

"జైలు ఊచ‌లు, ఉరికంబం భగత్ సింగ్ దృఢ సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. స్వాతంత్య్రం కోసం ఇది రెండో పోరాటం. మనీష్, సత్యేంద్ర (జైన్)లు నేటి త‌రం భగత్ సింగ్ లు" అని కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

ఈ కేసులో ఆప్ కమ్యూనికేషన్స్ చీఫ్, సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌ను సీబీఐ గత నెల చివర్లో అరెస్టు చేసింది.ఇటీవల, దక్షిణ భారతదేశంలోని కొంతమంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేస్తున్నారంటూ హైద‌రాబాద్ కు చెందిన అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టయిన రెండవ వ్యక్తి ఇత‌ను.

అయితే ఈ విష‌యంలో ఎలాంటి కుంభకోణం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది, రాజకీయ ప్రతీకారం కోసం మ‌నీష్ తివారీని ఈ కేసులోకి లాగారని వాదిస్తోంది. సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉంటే అరెస్టు చేయాలని కేజ్రీవాల్ కేంద్రానికి స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే. న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని బిజెపి ప్ర‌భుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తోంద‌ని, మంచిప‌నులు చేస్తున్న త‌మ పార్టీని ఢిల్లీ గ‌వ‌ర్న‌ర్ ద్వారా అడ్డుకుంటోంద‌ని ఆప్ అధినేత కేజ్రీవాల్ విమ‌ర్శించారు.

First Published:  16 Oct 2022 4:24 PM IST
Next Story