అనుకున్నంతా అయింది.. బీహార్‌లో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది..
సరిగ్గా బీహార్‌లో నితీష్ బలపరీక్ష రోజు సీబీఐ బీహార్లో ఎంట్రీ ఇచ్చింది ఈ రోజు తెల్లవారుజామున ముగ్గురు ఆర్జేడీ నేతల ఇళ్లపై దాడులు చేసింది.
బీహార్లో బీజేపీకి షాకిచ్చి జేడీయూ-ఆర్జేడీ కూటమి కట్టిన తర్వాత సోషల్ మీడియాలో సీబీఐ, ఈడీపై జోకులు పేలాయి. ఆ రెండు సంస్థల నెక్స్ట్ టార్గెట్ బీహారేనంటూ అందరూ ఊహించారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా సీబీఐకి స్వాగతం అంటూ సెటైర్లు పేల్చారు. అవసరమైతే సీబీఐ తమ ఇంట్లోనే బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయొచ్చని చెప్పారు. అయితే కాస్త గ్యాప్ తీసుకున్న సీబీఐ..సరిగ్గా బీహార్‌లో నితీష్ బలపరీక్ష రోజు బోణీ కొట్టింది. ఈ రోజు తెల్లవారుజామున సీబీఐ బీహార్లో ఎంట్రీ ఇచ్చింది. ముగ్గురు ఆర్జేడీ నేతల ఇళ్లపై దాడులు చేసింది.
యూపీఏ-1 గవర్నమెంట్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో ఉద్యోగాల కోసం భూములు అనే స్కామ్ వెలుగులోకి వచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2004-09 మధ్య కాలంలో లాలూ కుటుంబ సభ్యులు రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూములు లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌కి ఎట్టకేలకు సీబీఐకి మహూర్తం కుదిరింది. సరిగ్గా నితీష్ కుమార్ బలపరీక్ష రోజున సీబీఐ బీహార్లో సోదాలకు దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది. జేడీయూకి మద్దతిచ్చే విషయంలో ఇప్పటికే ఆర్జేడీ నేతల్ని కేంద్రం భయపెట్టిందని, మాట వినకపోవడంతో ఇలా సీబీఐతో దాడులు చేయిస్తోందని అంటున్నారు నేతలు.
ఆర్జేడీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్ అష్ఫాక్ కరీం, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ ఇళ్లలో సీబీఐ బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడి అని మండిపడ్డారు ఎమ్మెల్సీ సునీల్ సింగ్. ఆర్జేడీ నేతల్ని భయపెడితే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారనే ఆశతో ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు బీజేపీ కింద పని చేస్తున్నాయని.. బీజేపీ స్క్రిప్ట్ తో నడుస్తున్నాయని ఎంపీ మనోజ్ ఝా విమర్శించారు.