క్యాష్ తీస్తే అనుమానం.. అందుకే చిల్లర దొంగతనం..
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 11 కోట్ల రూపాయల విలువైన చిల్లర నాణేలు బ్యాంక్ నుంచి మాయమయ్యాయి. అప్పటి వరకు ఉన్నతాధికారులు ఆ విషయం గమనించలేదు. తీరా దొంగతనం బయటపడిన తర్వాత పోలీసుల్ని ఆశ్రయించారు.
బ్యాంకులో డబ్బులు దొంగతనం చేయాలనుకున్నవాళ్లు ముందుగా క్యాష్ జోలికెళ్తారు, చిల్లర సంచులు కనపడినా పక్కనపెట్టేస్తారు. ఇది దొంగల నైజం. కానీ ఇక్కడ బ్యాంకులో పనిచేసే ఇంటిదొంగలు క్యాష్ జోలికి వెళ్లలేదు, ఎవరికి అనుమానం రాకుండా చిల్లర సంచులు ఖాళీ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 11 కోట్ల రూపాయల విలువైన చిల్లర నాణేలు బ్యాంక్ నుంచి మాయమయ్యాయి. అప్పటి వరకు ఉన్నతాధికారులు ఆ విషయం గమనించలేదు. తీరా దొంగతనం బయటపడిన తర్వాత పోలీసుల్ని ఆశ్రయించారు. రాజస్థాన్ హైకోర్ట్ ఆదేశాల మేరకు నాణేల దొంగతనం విషయంలో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. ఇంటిదొంగల పనిగా అనుమానిస్తూ వారి ఇళ్లలో సోదాలు చేపట్టింది.
రాజస్థాన్ కరౌలీ లోని మెహందీపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గతేడాది ఈ దొంగతనం జరిగింది. ఈ ఏడాది కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు బ్యాంక్ సిబ్బందిని అనుమానిస్తూ సోదాలు చేస్తున్నారు. మాజీ సిబ్బంది పాత్ర కూడా ఉందని తేల్చారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, అల్వార్, ఉదయ్ పూర్, భిల్వారాలోని 25 ప్రాంతాల్లో సోదాలు చేశారు సీబీఐ అధికారులు. 15 మంది మాజీ బ్యాంకు అధికారుల ఇళ్లలో, వారికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు.
రాజస్థాన్ లోని మెహందీపూర్ బ్రాంచ్ లో కాయిన్స్ నిల్వ, నిర్వహణకు ప్రత్యేక విభాగం ఉంది. ఇక్కడ నాణేలను నిల్వచేస్తుంటారు. గతేడాది ఆగస్ట్ లో కాయిన్ కౌంటింగ్ చేపట్టగా నిల్వల్లో భారీగా తేడాలొచ్చాయి. 13కోట్ల రూపాయల కాయిన్స్ ఉండాల్సింది కేవలం 2కోట్ల రూపాయల కాయిన్స్ మాత్రమే కనపడ్డాయి. మిగతా 11కోట్లు మిస్సయ్యాయి. క్యాష్ లావాదేవీలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది కానీ, కాయిన్స్ విషయంలో ఏడాదికోసారి మాత్రమే లెక్కలు చూస్తారు. దీంతో ఇంటిదొంగలకు పని సులభమైంది. క్రమక్రమంగా కాయిన్స్ సంచులు మాయం చేస్తూ మొత్తం 11కోట్ల రూపాయలు కొట్టేశారు. ఇది భారీ స్కామ్ కావడంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు హైకోర్ట్ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.