Telugu Global
National

దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. ఈసారి రాజకీయాలు లేవు..

సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి జూలు విదిల్చింది. దేశవ్యాప్తంగా దాడులు చేపట్టింది. 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం సహా.. మొత్తం 56 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు సీబీఐ అధికారులు.

దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. ఈసారి రాజకీయాలు లేవు..
X

బూతు సినిమాలు, బూతు వీడియోలు.. ఒకప్పుడు నాలుగు గోడల మధ్య వ్యవహారం, కానీ సోషల్ మీడియా వృద్ధి చెందిన తర్వాత అది ఇప్పుడు ప్రతి జేబులోకి సెల్ ఫోన్ రూపంలో వచ్చేసింది. అందులోనూ చైల్డ్ పోర్న్ అనేది ఇప్పుడు అత్యంత దారుణమైన వ్యవహారంగా మారింది. చిన్న పిల్లలపై లైంగిక దాడులు, వారి కేంద్రంగా జరుగుతున్న పోర్న్ వీడియోల రాకెట్ భారత్‌లో కూడా విస్తరించింది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది పిల్లలు బాధితులుగా మారినా.. దానికి కారకులపై చర్యలు తీసుకోవడం మాత్రం చట్టానికి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి జూలు విదిల్చింది. పిల్లల అశ్లీల వీడియోల ప్రసారానికి సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాంగంపై వివరణాత్మక నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని గతవారం ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పుడు సీబీఐ దేశవ్యాప్తంగా దాడులు చేపట్టింది. 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం సహా.. మొత్తం 56 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు సీబీఐ అధికారులు.

న్యూజిలాండ్‌లోని ఇంటర్‌ పోల్ యూనిట్, సింగపూర్ నుంచి వచ్చిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. పిల్లలకు సంబంధించిన లైంగిక మెటీరియల్ సర్క్యులేట్ చేస్తున్న ముఠాలను గుర్తించారు అధికారులు. వారి వద్ద డేటాను సీజ్ చేయడంతోపాటు, అరెస్ట్‌లకు తెరతీశారు. 'ఆపరేషన్ మేఘ్ చక్ర' పేరుతో సీబీఐ ఈ దాడులు చేపట్టింది.

క్లౌడ్ స్టోరేజీ లక్ష్యంగా దాడులు..

చైల్డ్ పోర్న్ రాకెట్ ఈ మెటీరియల్‌ను క్లౌడ్ స్టోరేజ్ ద్వారా ప్రపంచ వ్యాప్తం చేస్తోంది. ఇదో పెద్ద బిజినెస్‌గా మారింది. చిన్నారులను బెదిరించి తీసే వీడియోలు, ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం, లైంగిక దాడులకు పాల్పడటం, చివరకు వారి ప్రాణాలు తీయడం... ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా చోట్ల వెలుగు చూశాయి. విచిత్రం ఏంటంటే ఇందులో బాలికలతోపాటు బాలురు కూడా బాధితులుగా ఉన్నారు. ఇలాంటి ముఠాలు చెలరేగితే అది భవిష్యత్ తరానికే ప్రమాదం. ఒకసారి లైంగిక దాడికి గురైనవారిని జీవితాంతం ఆ పీడ కల వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో కేంద్రానికి పలు సూచనలు చేసింది. తాజాగా సమాచారం కోరడంతో.. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది. ఆన్‌లైన్‌లో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ వ్యాప్తి చేసే వ్యక్తులు, ముఠాలను గుర్తించడంతో పాటు వారిని పట్టుకునేందుక సీబీఐ `ఆపరేషన్ మేఘ్ చక్ర` మొదలు పెట్టింది. మైనర్ల అక్రమ లైంగిక కార్యకలాపాల ఆడియో, వీడియోలను ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టారు. గతంలో ఆపరేషన్ కార్బన్ పేరుతో పిల్లల అశ్లీల వీడియోలను ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ లక్ష్యంగా సీబీఐ దాడులు నిర్వహించింది. దానికి కొనసాగింపుగా `మేఘ్ చక్ర` నిర్వహిస్తోంది.

First Published:  24 Sept 2022 3:45 PM IST
Next Story