జోడో యాత్రలో పాల్గొన్నాడు.. సీబీఐ కేసు పెట్టింది
కరెన్సీ నోట్ల ముద్రణలో ఉపయోగించే ‘ఆకుపచ్చ రంగు సెక్యూరిటీ థ్రెడ్’ సరఫరాలో అవినీతి జరిగిందనేది అరవింద్ మాయారాంపై ఉన్న అభియోగం. అప్పట్లో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
1978 బ్యాచ్ మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ మాయారాం. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కు ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కొద్ది రోజుల వ్యవధిలోనే అరవింద్ మాయారాం నివాసాల్లో సోదాలు జరగడం, సీబీఐ కేసు నమోదు చేయడం విశేషం. 2004-2013 మధ్య జరిగినట్టుగా చెబుతున్న అవినీతి ఆరోపణల విషయంలో ఆయనపై కేసు నమోదు చేసింది సీబీఐ.
కరెన్సీ నోట్ల ముద్రణలో ఉపయోగించే ‘ఆకుపచ్చ రంగు సెక్యూరిటీ థ్రెడ్’ సరఫరాలో అవినీతి జరిగిందనేది అరవింద్ మాయారాంపై ఉన్న అభియోగం. అప్పట్లో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. బ్రిటన్ కి చెందిన దె-ల-రూ ఇంటర్నేషనల్ కంపెనీకి అయాచిత లబ్ధి కలిగించారనే ఆరోపణలతో మాయారాంపై విచారణ చేపట్టారు సీబీఐ అధికారులు.
కరెన్సీ నోట్లపై వినియోగించే ఆకుపచ్చ రంగు సెక్యూరిటీ థ్రెడ్ సరఫరాకోసం ఐదేళ్లకు దె-ల-రూ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తో 2004లో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి 2015 డిసెంబరు 31 వరకు నాలుగు సార్లు ఆ ఒప్పందాన్ని పొడిగించారు. అయితే ఆ సెక్యూరిటీ థ్రెడ్ సరఫరా చేసే విషయంలో బ్రిటన్ కంపెనీకి పేటెంట్ లేకపోయినా కాంట్రాక్ట్ అప్పగించారని అంటున్నారు. పేటెంట్ తనిఖీ చేయకుండా ఆ కంపెనీతో సెక్యూరిటీ థ్రెడ్ తెప్పించుకున్నారని, ఆ తర్వాత 2011లో కంపెనీకి పేటెంట్ మంజూరైందని, ఆ విషయాలను ఆర్బీఐకి అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి మాయారాం చెప్పలేదంటూ సీబీఐ అభియోగాలు మోపింది. చివరిసారిగా 2013లో కాంట్రాక్ట్ ని మరో మూడేళ్లపాటు పొడిగించారు. అప్పుడు కూడా పేటెంట్ విషయాన్ని దాచిపెట్టారంటోంది.
మాజీ ఐఏఎస్ అధికారిపై పెట్టిన ఈ కేసు ఇప్పుడు సంచలంగా మారింది. రాహుల్ గాంధీతో కలసి ఇటీవల భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు అరవింద్ మాయారాం. ఆ తర్వాతే ఈ కేసు పెట్టడం.. ఢిల్లీ, జైపూర్ లోని ఆయన ఇల్లు, ఇతర కార్యాలయాల్లో సోదాలు చేయడంతో కలకలం రేగింది. ఉద్దేశపూర్వకంగానే ఈ సోదాలు జరిగాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీబీఐని మరీ ఇంత దారుణంగా వాడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.