రూ.5 కోట్ల భారీ సైబర్ నేరం.. - అమెరికన్ మహిళ నుంచి కొట్టేసిన నిందితులు
లిసా రోథ్ తన ల్యాప్‌టాప్ హ్యాక్ అయినట్లు గుర్తించి, ఆన్‌లైన్‌లో కనిపించిన మైక్రోసాఫ్ట్ నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసింది. ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించిన నిందితులు.. ఆమె రిటైర్మెంట్ మొత్తం గురించిన సమాచారం తెలుసుకున్నారు.
సైబర్ నేరగాళ్లు అమెరికాకు చెందిన మహిళను రూ.5 కోట్ల మేరకు మోసం చేశారు. మైక్రోసాఫ్ట్ కస్టమర్ కేర్ ఉద్యోగులమంటూ నమ్మించి ఆమె నుంచి ఈ నగదు కొట్టేశారు. అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అందించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (CBI) నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపింది.
సీబీఐ అరెస్ట్ చేసిన నిందితుల్లో ఢిల్లీకి చెందిన ప్రఫుల్ గుప్తా, సరితా గుప్తా, కునాల్ అల్మాడీ, గౌరవ్ పహ్వాలతో పాటు కాన్పూర్‌కు చెందిన రిషబ్ దీక్షిత్ ఉన్నారు. వీరిని అరెస్ట్ చేయడానికి ముందు సీబీఐ ఢిల్లీ, కాన్పూర్‌లలోని పలుచోట్ల సోదాలు నిర్వహించింది. నిందితులు ఐదుగురు మైక్రోసాఫ్ట్ కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నమ్మించి అమెరికాకు చెందిన లిసా రోథ్ అనే మహిళ నుంచి రెండు విడతల్లో రూ. 5 కోట్లు కొట్టేసినట్లు సీబీఐ పేర్కొంది.
సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లిసా రోథ్ తన ల్యాప్‌టాప్ హ్యాక్ అయినట్లు గుర్తించి, ఆన్‌లైన్‌లో కనిపించిన మైక్రోసాఫ్ట్ నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసింది. ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించిన నిందితులు.. ఆమె రిటైర్మెంట్ మొత్తం గురించిన సమాచారం తెలుసుకున్నారు. అనంతరం ఆ మొత్తాన్ని ముందు జాగ్రత్తగా క్రిప్టో కరెన్సీ ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు. ఆమె కోసం ఓ క్రిప్టో ఖాతా ఓపెన్ చేసినట్లుగా నమ్మించి.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి నాలుగు లక్షల డాలర్ల (సుమారు రూ.3.33 కోట్లు) మొత్తాన్ని క్రిప్టో ఖాతాకు బదిలీ చేయించారు.
ఆ తర్వాత లిసా రోథ్ నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా క్రిప్టో కాయిన్లను నగదు రూపంలోకి మార్చేందుకు ప్రయత్నించగా ఖాతాలో ఎలాంటి క్రిప్టో కరెన్సీ నిల్వలూ లేవని చూపించింది. మరోమారు ఆమె నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసింది. దీంతో మరో మూడు లక్షల డాలర్లు (సుమారు రూ.2.47 కోట్లు) బదిలీ చేస్తే.. మొత్తం నగదు ఒకేసారి తీసుకోవచ్చని నిందితులు లిసాను నమ్మించారు. వారు చెప్పినట్టుగానే ఆమె మరో మూడు లక్షల డాలర్లు క్రిప్టో ఖాతాకు బదిలీ చేసేందుకు ప్రయత్నించగా.. పేరు తప్పుగా రాసిన కారణంగా ఆ నగదు తిరిగి ఆమె బ్యాంక్ ఖాతాలోనే జమ అయింది.
మరోమారు ఆమెను సంప్రదించిన నిందితులు మరో క్రిప్టో ఖాతాలోకి నగదు బదిలీ చేయాలని సూచించారు. వారు చెప్పినట్టుగా నగదు బదిలీ చేసిన లిసా, వారం తర్వాత తన రెండు క్రిప్టో ఖాతాలను తెరిచి చూడగా.. వాటిలోని మొత్తం భారత్‌లోని 5 బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్టు గుర్తించింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన లిసా అమెరికన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ అధికారులు.. భారత్‌కు చెందిన ఐదుగురు ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. వారు సీబీఐకి సమాచారం అందించడంతో ఇక్కడ దర్యాప్తు చేసిన సీబీఐ నిందితులను అరెస్ట్ చేసింది.