కులం మనల్ని విడగొట్టింది..ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలకవ్యాఖ్యలు
ఈ దేశానికి విదేశీయుల రాకవల్లనే కులం ప్రాధాన్యత పెరిగిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కులం ఈ దేశ ప్రజలను విడగొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.
కులం ఈ దేశంలో ఎంత కీలకపాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా రాజకీయ పార్టీలు కులాన్ని వాడుకుంటాయి. ఎందరో నేతలు ఈ కులాల పునాది మీదనే పైకొస్తారు. ఇదిలా ఉంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కులంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాగ్‌పూర్‌లో జరిగిన 'భారత్@2047: మై విజన్ మై యాక్షన్' అనే కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' పని విభజన కోసమే.. మన పూర్వీకులు కులవ్యవస్థను తీసుకొచ్చారు. కానీ నేడు అదే వ్యవస్థ మనల్ని విడగొడుతోంది' అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. వైరుధ్యాలను మనదేశం సమర్థంగా ఎదుర్కొంటోంది. ఎన్ని కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్నా మనమంతా ఒక్కటిగానే ఉంటున్నాం.
వేషధారణ వేరైనా మన భావజాలం ఒక్కటే. ఒక్కటే సమతా దృక్పథంతో మనం ముందుకు సాగాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ వైపే చూస్తున్నాయన్నారు. చరిత్ర వక్రీకరణ జరిగిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
వాయువ్య ప్రాంతాల నుంచి వచ్చిన విదేశీయులు భారతదేశాన్ని ఆక్రమించుకున్నారని.. ఆ సమయంలో కులం, ఇతర అంశాలపై ప్రాధాన్యత పెరిగిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
కానీ నిజానికి దేశంలో కులం ఎప్పటి నుంచో ఉంది. రుగ్వేద కాలం నుంచి కులం ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే కేవలం విదేశీయులు రాకతోనే కులం ప్రభావం పెరిగిందని మోహన్ భాగవత్ చెప్పడం గమనార్హం.