Telugu Global
National

మొన్న కాషాయ బికినీ.. ఈరోజు లక్ష్మీదేవి హారం

సోషల్ మీడియాలో కూడా తాప్సీపై ట్రోలింగ్ మొదలైంది. అలాంటి దుస్తులు ధరించి, దానిపై లక్ష్మీదేవి హారాన్ని వేసుకుని హిందూ దేవతలను తాప్సీ కించపరిచారంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు.

మొన్న కాషాయ బికినీ.. ఈరోజు లక్ష్మీదేవి హారం
X

ఎవరెవరు ఏయే దుస్తులు ధరించాలి, వాటికి మ్యాచింగ్ గా ఎలాంటి నగలు వేసుకోవాలి. సినిమాల్లో హీరో హీరోయిన్లయినా సరే ఇకపై ముందుగా బీజేపీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సిందే. దీనికి తగ్గట్టే ఇప్పుడు వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఆమధ్య పఠాన్ సినిమాలో దీపికా పదుకోన్ కాషాయ బికినీ ధరించిందని రచ్చ రచ్చ చేశారు బీజేపీ నేతలు. చివరకు ఆ బికినీ సీన్ సినిమాలో నుంచి డిలీట్ చేయించే వరకు పోరాటం చేశారు. తాజాగా మరో హీరోయిన్ తాప్సిపై ఇలానే విమర్శలు ఎక్కుపెట్టారు. ఆమె ధరించిన లక్ష్మీదేవి నెక్లెస్ వివాదానికి కేంద్రబిందువైంది. ఆమెపై ముంబైలో కేసు నమోదైంది.

హీరోయిన్ తాప్సి ఇటీవల ఓ ఫ్యాషన్ షో లో పాల్గొంది. మార్చి 12న ముంబైలో జరిగిన ఆ ఫ్యాషన్ షో లో.. ఆమె ఎర్రని గౌనులో ర్యాంప్ వాక్ చేసింది. ఆ గౌను విషయంలో బీజేపీ నేతలకు పట్టింపేమీ లేదు. కానీ ఆమె ధరించిన లక్ష్మీదేవి హారంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎద భాగం కనిపించేటట్టు బట్టలు వేసుకున్న తాప్సి, మెడలో లక్ష్మీదేవి హారం ధరించి హిందువులను కించపరిచారంటూ గొడవ చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు, బీజేపీ నాయకులు.

మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ కొడుకు, హింద్ రక్షక్ సంఘటన కన్వీనర్ ఏకలవ్య గౌర్‌.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. తాప్సీపై ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా తాప్సీ వ్యవహరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో కూడా తాప్సీపై ట్రోలింగ్ మొదలైంది. అలాంటి దుస్తులు ధరించి, దానిపై లక్ష్మీదేవి హారాన్ని వేసుకుని హిందూ దేవతలను తాప్సీ కించపరిచారంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు తాప్సీకి మద్దతుగా మరో వర్గం పోస్టింగ్ లు పెడుతోంది. భారత దేశంలో స్త్రీ ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి ఆభరణాలు వేసుకోవాలి అనే విషయంలో ఎవరూ నిర్ణయాధికారం తీసుకోలేరని అంటున్నారు. అది నిరంకుశత్వం అవుతుందని, భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమేనని బదులిస్తున్నారు.

First Published:  29 March 2023 10:13 AM IST
Next Story