Telugu Global
National

సీఎం అశోక్ గెహ్లాట్ పై అనుచిత వ్యాఖ్యలు..కేంద్ర మంత్రిపై కేసు నమోదు

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చిత్తోడ్ ఘడ్ లోని సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గజేంద్ర సింగ్ షెకావత్ పై ఐపీసీ సెక్షన్ 143, 153ఏ, 295ఏ, 500, 504, 505, 511 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఎం అశోక్ గెహ్లాట్ పై అనుచిత వ్యాఖ్యలు..కేంద్ర మంత్రిపై కేసు నమోదు
X

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రావణుడికి పది తలలు ఉన్నట్లు రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా పది తలలు ఉన్నాయని కేంద్రమంత్రి వ్యాఖ్యానించగా.. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. చిత్తోడ్ ఘడ్ లో ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో జన్ ఆక్రోష్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. రావణుడికి పది తలలు ఉన్నట్లు రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా పది తలలు ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, అవినీతిలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందని ఆరోపించారు.

రాజస్థాన్ ప్రభుత్వం మాఫియాను పెంచి పోషిస్తోందని షెకావత్ విమర్శలు చేశారు. రాజస్థాన్‌లో రావణుడి పాలనను అంతం చేసి రామరాజ్యం స్థాపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను కేంద్ర‌మంత్రి షెకావత్ రావణుడితో పోల్చడం తీవ్ర వివాదంగా మారింది. షెకావత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ విషయమై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చిత్తోడ్ ఘడ్ లోని సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గజేంద్ర సింగ్ షెకావత్ పై ఐపీసీ సెక్షన్ 143, 153ఏ, 295ఏ, 500, 504, 505, 511 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

2019లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీ పేరు పెట్టుకున్న వాళ్లంతా దొంగలే.. అని విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై గుజరాత్ కు చెందిన ఓ బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో రాహుల్ పై కేసు నమోదు అయింది. ఈ కేసులో కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. బీజేపీ నాయకులు కావాలనే రాహుల్ గాంధీ పై కేసు పెట్టారని కాంగ్రెస్ శ్రేణులు అప్పట్లో విమర్శించాయి. బీజేపీ చేసిన పనికి కౌంటర్ గానే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పై కేసు పెట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  1 May 2023 1:15 PM IST
Next Story