Telugu Global
National

కరోనా గుర్తులు చెరిగిపోయాయి.. కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డ్

2022లో జరిగిన మొత్తం కార్ల విక్రయాల్లో 42.3 శాతం ఎస్.యు.వి. లే కావడం గమనార్హం. మొత్తం అమ్మకాల్లో 40శాతం పైగా కార్లు రూ.10లక్షల పైన ఉన్న రేంజ్ లోనే ఉన్నాయి.

కరోనా గుర్తులు చెరిగిపోయాయి.. కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డ్
X

కరోనా గుర్తులు మెల్ల మెల్లగా చెరిగిపోతున్నాయి. పాతకాలం తిరిగొస్తోంది, వ్యాపారాలు మళ్లీ కుదుటపడుతున్నాయి. భారత్ లో కార్ల అమ్మకాల్లో 2022 సరికొత్త రికార్డ్ సాధించింది. కరోనాకంటే ముందు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఏడాదిలో ఏకంగా 23శాతం అమ్మకాలు పెరగగా, మొత్తం ఈ ఏడాది 37.93 లక్షల యూనిట్ల అమ్మకాలు జరగడం విశేషం.

సెమీ కండక్టర్ల కొరత తీరింది..

కరోనా తర్వాత సెమీకండక్టర్ల కొరత మొదలైంది. విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సిన సెమీకండక్టర్ల కొరత వల్ల ఆమధ్య కార్లు సకాలంలో డెలివరీ చేయలేకపోయారు, ఇప్పుడవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ఎక్కడా వెయిటింగ్ లిస్ట్ లేదు. ఇది కార్ల అమ్మకాలకు పూర్తిగా కలిసొచ్చింది. దాదాపుగా అన్నికంపెనీలు కొత్త రికార్డులు అందుకున్నాయి.

ఎస్.యు.వి. లకు డిమాండ్..

గతంలో కారు అంటే బేసిక్ మోడల్ వైపు వెళ్లేవారు చాలామంది. కానీ ఇప్పుడు లగ్జరీ మోడళ్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. 2022లో జరిగిన మొత్తం కార్ల విక్రయాల్లో 42.3 శాతం ఎస్.యు.వి. లే కావడం గమనార్హం. మొత్తం అమ్మకాల్లో 40శాతం పైగా కార్లు రూ.10లక్షల పైన ఉన్న రేంజ్ లోనే ఉన్నాయి.

అమ్మకాల్లో టాప్ మారుతి..

మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, మైలేజీ ఎక్కువ కావడంతో సగటు భారతీయుడు మారుతి-సుజుకి కార్లపైనే మనసుపడ్డాడని అర్థమవుతోంది. 2022లో అమ్ముడైన మొత్తం కార్లలో మారుతి-సుజికి వాటా 15.76 లక్షలు. అంటే భారత్ లో అమ్ముడైన కార్లలో దాదాపు సగానికి దగ్గరగా మారుతి వాహనాలు ఉన్నాయి. గతేడాదికంటే ఈ కంపెనీ అమ్మకాల్లో 13.64 శాతం వృద్ధి సాధించింది. హుందయ్ మోటర్స్ కూడా గణనీయంగా అమ్మకాలు పెంచుకుంది. 5.52 లక్షల యూనిట్లను హుందయ్ అమ్మేసింది. టాటా మోటార్స్ ఈఏడాది తొలిసారిగా 5లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు సాధించింది. మహీంద్రా, టయోటా, స్కోడా కంపెనీలు కూడా గతేడాది కంటే అమ్మకాలను మెరుగుపరచుకున్నాయి. మొత్తమ్మీద కరోనా పూర్వ పరిస్థితుల్ని కూడా కార్ల పరిశ్రమ అధిగమించింది. ఆఫర్లతో ఆకట్టుకుంది, అమ్మకాల్లో అదరగొట్టింది.

First Published:  2 Jan 2023 8:59 AM IST
Next Story