గవర్నర్ గా మారుతున్న కెప్టెన్..
భవిష్యత్తులోకూడా పంజాబ్ లోఅమరీందర్ తో పెద్దగా ఉపయోగం లేదని తేలిపోవడంతో ఆయన్ను గవర్నర్ గా పంపించేందుకు బీజేపీ సిద్ధపడింది. మహారాష్ట్ర గవర్నర్ గా అమరీందర్ ని నియమించబోతోంది.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతోంది. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆ బాధ్యతలనుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఆయన స్థానంలో అమరీందర్ ని అక్కడికి పంపించబోతోంది బీజేపీ. రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్న అమరీందర్ కి అలా వీడ్కోలు పలుకుతోంది బీజేపీ.
కాంగ్రెస్ హయాంలో సుదీర్ఘ కాలంపాటు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆ పార్టీని వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ ప్రారంభించి, ఆ తర్వాత బీజేపీలో దాన్ని విలీనం చేసి, తాజా ఎన్నికల్లో పరాభవం తర్వాత ప్రస్తుతం వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో అమరీందర్ సాయంతో పాగా వేయాలని చూసిన బీజేపీ పాచికలు పారకపోవడం, భవిష్యత్తులోకూడా అక్కడ అమరీందర్ తో పెద్దగా ఉపయోగం లేదని తేలిపోవడంతో ఆయన్ను గవర్నర్ గా పంపించేందుకు బీజేపీ సిద్ధపడింది. మహారాష్ట్ర గవర్నర్ గా అమరీందర్ ని నియమించబోతోంది.
వివాదాల కోష్యారీకి వీడ్కోలు..
మహారాష్ట్ర గవర్నర్ గా సెప్టెంబర్ 2019లో బాధ్యతలు చేపట్టిన కోష్యారీ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. గత ఎన్నికల తర్వాత బీజేపీకి మెజార్టీ లేకపోయినా దేవేంద్ర ఫడ్నవీస్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చారు. ఆ తర్వాత ఫడ్నవీస్ రాజీనామా చేయడం, మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం గద్దనెక్కడం, శివసేనలో చీలిక తెచ్చి ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో మళ్లీ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఇలా అక్కడ రకరకాల రాజకీయ పరిణామాలకు కోష్యారీ సాక్షిగా నిలిచారు. ఆ మధ్య ఛత్రపతి శివాజీపై కోష్యారీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఆయన తనకు తానే పదవినుంచి వైదలగుతానంటున్నారు. ఆ స్థానం ఇప్పుడు అమరీందర్ తో భర్తీ చేయాలని చూస్తోంది బీజేపీ.