Telugu Global
National

కాళ్ళు పట్టుక వదలనన్నడు....ఓట్ల కోసం పాట్లు

రాజస్థాన్ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అభ్యర్థులు అమ్మాయిల కాళ్ళు పట్టుకొని వదలకుండా ఓట్లడిగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్ ఎస్ యూ ఐ , ఏబీవీపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థులు ఓట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు.

కాళ్ళు పట్టుక వదలనన్నడు....ఓట్ల కోసం పాట్లు
X

ఎన్నిల సమయంలో రాజకీయ నాయకుల చిత్ర విచిత్ర విన్యాసాలు చూస్తూ ఉంటాం. ఓట్లడగడానికి ఇల్లిల్లూ తిరుగుతూ పిల్లలకు స్నానాలు చేయించడం, అంట్లు తోమడంలో, ఇంటి పనులు చేయడంలో సహకరించడం, బార్బర్ షాపుల్లో గడ్డాలు గీయడం...ఇలా ఒకటేమిటి అనేక కళలు ప్రదర్శించడం మనకు తెలిసిందే. అయితే ఈ కళా ప్రదర్శన‌ ఇప్పుడు విద్యార్థి సంఘాల ఎన్నికలకు కూడా పాకింది.

రాజస్థాన్ లో ఈ రోజు 12 కళాశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల కాంగ్రెస్ అనుబంద సంఘం ఎన్ ఎస్ యూ ఐ, బీజేపీ(ఆరెస్సెస్) అనుబంద సంఘం ఏబీవీపీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఓట్ల కోసం రెండు సంఘాల అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.

భరత్‌పూర్‌లో ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు రోడ్డు మీద బోర్లా పడి అమ్మాయిల కాళ్ళు పట్టుకొని వదలని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓట్లు వేయడానికి వస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల కాళ్ళు పట్టుకొని మీకే ఓటేస్తాం అని చెప్పిన దాకా వదల లేదు. కొందరైతే విద్యార్థులను కూర్చో బెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకు పూజలు చేసి మరీ ఓట్లు అడిగారు. అమ్మాయిల కాళ్ళు వదలకుండా పట్టుకున్న అభ్యర్థులను కాళ్ళు వదిలేయమంటూ అమ్మాయిలు బతిమిలాడుకున్నా వినలేదు. ఓటేస్తామని ఒట్టేసి చెప్తేనే వదులుతామంటూ ఏడ్చినంత పని చేశారు. కొందరు విద్యార్థినిలు వీళ్ళు చేస్తున్న హంగామా చూసి వీళ్ళకు దూరంగా పారిపోయారు.

చివరకు ఓటేస్తామని హామీ ఇచ్చి అభ్యర్థుల బారి నుండి తప్పించుకొని విద్యార్థులు ఓట్లేశారు. మొత్తానికి ఎన్నికలు అయిపోయాయి. ఏబీవీపీ, ఎన్ ఎస్ యూ ఐ అభ్యర్థుల కళా ప్రదర్శన‌ కూడా ఆగిపోయింది. ఇక ఫలితాలు రావాల్సి ఉంది. అభ్యర్థుల కాళ్ళు మొక్కే కాంపిటీషన్ ఫలితాన్నిచ్చిందా లేదా అనేది రేపు తేలనుంది.

అయితే వీళ్ళు ఈ ఎన్నికల్లో ఓడినా గెల్చినా భవిష్యత్తు లో మాత్రం తప్పకుండా రాజకీయ నాయకులయ్యే అన్ని లక్షణాలు వీళ్ళలో ఉన్నాయని ఈ వీడియో చూసిన నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.




First Published:  26 Aug 2022 8:33 PM IST
Next Story