Telugu Global
National

ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపు రద్దు చేయండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ బ్యూరోక్రాట్ల లేఖ..!

కేజ్రీవాల్ పై బీజేపీ నాయకులు పోరు సాగిస్తుండగా వారికి మాజీ బ్యూరోక్రాట్లు తోడయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ బ్యూరోక్రాట్లు తాజాగా లేఖ రాశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపు రద్దు చేయండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ బ్యూరోక్రాట్ల లేఖ..!
X

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో తలపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండగా.. ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కేజ్రీవాల్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల గుజరాత్ లో కూడా పర్యటించారు. దీంతో ప్రస్తుతం పరిస్థితి ఆప్ వర్సెస్ బీజేపీగా మారింది. బీజేపీ నాయకులు వరుసబెట్టి ఆప్ పై విమర్శల దాడి చేస్తున్నారు.

కేజ్రీవాల్ పై బీజేపీ నాయకులు ఇలా పోరు సాగిస్తుండగా వారికి మాజీ బ్యూరోక్రాట్లు తోడయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ బ్యూరోక్రాట్లు తాజాగా లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులను పార్టీ తరఫున పని చేయించుకునేందుకు ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

పోలింగ్ బూత్ ఆఫీసర్లు, ప్రజా రవాణా వ్యవస్థ డ్రైవర్లు, అంగన్వాడీ వర్కర్లు, పోలీసులు, హోంగార్డులు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేయాలని ఇటీవల కేజ్రీవాల్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తీరును వ్య‌తిరేకిస్తూ మాజీ బ్యూరోక్రాట్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సేవకులను అధికార పార్టీ తమ ఎన్నికల కోసం, స్వార్థం కోసం వాడుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై మాజీ బ్యూరోక్రాట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎన్నికల కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని.. ఇది ప్రజాప్రతినిధుల చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని పేర్కొన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ 1968 ఎన్నికల సింబల్స్ ఆర్డర్లోని 16ఏను ఉల్లంఘిస్తోందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. తాము తెలియజేసిన అంశాలను పరిగణనలోకి ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ బ్యూరోక్రాట్లు కోరారు. ఆమ్ ఆద్మీ కోసం పనిచేసే ఉద్యోగులకు వారికి కావలసిన చోటుకు ట్రాన్స్ ఫర్లు ఇస్తామని ఆశ చూపుతోందని, ఉచిత విద్యుత్తు, ఉచిత విద్య అంటూ ప్రజలకు లెక్కలేనన్ని హామీలు ఇస్తూ వారిని ప్రలోభాలకు గురిచేస్తోందని మాజీ బ్యూరోక్రాట్లు మండిపడ్డారు.

First Published:  16 Sept 2022 12:57 PM IST
Next Story