Telugu Global
National

ఈ ‘శిక్ష’ రాహుల్‌కు సదవకాశమా..?

కోర్టు తీర్పు ఎలా వున్నప్పటికీ అంతా ఒక ముందస్తు పథకం ప్రకారం జరిగిందన్నది స్పష్టం. లోక్‌సభ సచివాలయం రాహుల్‌ మీద ప్రకటించిన అనర్హత వేటుతోనే ఈ ఘట్టం ముగిసిపోలేదు.

ఈ ‘శిక్ష’ రాహుల్‌కు సదవకాశమా..?
X

తన మీద చేసిన ఆరోపణలకు పార్లమెంటులోనే జవాబు చెబుతానన్న రాహుల్‌ గాంధీని అసలు పార్లమెంటులోకి అడుగుపెట్టకుండా చేయాలన్న బీజేపీ వ్యూహానికి అనుగుణంగా నిన్న ఇవాళ్టి పరిణామాలు సంభవించాయి. కేవలం ఒక ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకు గాను ఓ ఎంపీకి రెండేళ్ళ జైలుశిక్ష విధించడం భారతీయ‌ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి.

కోర్టు తీర్పు ఎలా వున్నప్పటికీ అంతా ఒక ముందస్తు పథకం ప్రకారం జరిగిందన్నది స్పష్టం. లోక్‌సభ సచివాలయం రాహుల్‌ మీద ప్రకటించిన అనర్హత వేటుతోనే ఈ ఘట్టం ముగిసిపోలేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్ళ జైలు శిక్షను అనుభవించిన ప్రజా ప్రతినిధి మరో ఎనిమిదేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. కనుక సూరత్‌ కోర్టు తీర్పు మీద పైకోర్టులో అప్పీల్‌ చేయడం వరకే పరిమితమైతే సరిపోదు. మొత్తంగా ఈ కేసును కొట్టివేస్తేనే గానీ వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ పోటీ చేయడానికి వీలు ఉండదు.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు కదలిపోతున్నాయని లండన్‌లో రాహుల్‌ చేసిన ప్రసంగంలో అబద్ధమేమీ లేదని కాషాయ పాలకుల నియంతృత్వ పోకడలు చెప్పకనే చెబుతున్నాయి. తమని ప్రశ్నించే వారెవరైనా ఉపేక్షించేది లేదని రాహుల్‌ని ‘శిక్షించడం’ ద్వారా సంఘ్‌ పరివార్‌ తెలియజేస్తుంది. అంబానీ-అదానీ ఉదంతం మీద, సకల వ్యవస్థల్లోకి ఆర్‌ఎస్‌ఎస్‌ చొరబాటు పైన ఇతరుల కన్నా ఎక్కువగా రాహుల్‌ ప్రశ్నిస్తూ వచ్చారు. అదానీ-మోదీల మధ్య బంధానికి కారణమేంటన్న రాహుల్‌ ప్రశ్నలకు జవాబు చెప్పకపోగా, ప్రశ్నిస్తే సహించేది లేదని రాహుల్‌ పై ముప్పేట దాడి చేయడం బీజేపీ నిరంకుశ పోకడలకు పరాకాష్ట.

ఎవరేమనుకున్నా తమకు తోచినట్టుగా వ్యవహరిస్తామనే బీజేపీ పాలకుల దాష్టీకానికి మూడు కారణాలున్నాయి.

ఒకటి: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మూడోసారి అధికారంలోకి రావలన్నది మోదీ స్వప్నం. ఆయన కల నెరవేరడం అంత సులువు కాదని ఇటీవల‌ రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్‌గాంధీ నుంచి ఎదురవుతున్న సవాళ్ళు ఇబ్బందికరంగా పరిణమించాయి. కనుక రాహుల్‌ రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేయాలనుకున్నారు. కనుకనే రాహుల్‌ మీద అనర్హత వేటుకు అనువుగా పావులు కదిపారు.

రెండు: మూడోసారి గెలిచి హిందూ రాజ్యస్థాపన అన్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌, బ‌జరంగదళ్‌ తహతహలాడుతున్నాయి. కనుక రానున్న ఎన్నికల్లో మోదీ గెలుపునకు అడ్డువచ్చేవారిని ఎన్నికల బరిలో నిలవకుండా చేయాలని భావిస్తున్నాయి. ఈక్రమంలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌ను బలహీనపరచాలనే కుట్రకు తెగబడ్డాయి. ఈ కుట్రలో భాగమే రాహుల్‌ మీద అన్నిరకాలుగా దాడులు చేస్తూ చివరకు పార్లమెంటులోకి అడుగు పెట్టకుండా చేశారు.

మూడు: గాంధీ-నెహ్రూ కుటుంబ వారసునిగా రాహుల్‌గాంధీకి ఉన్న చరిష్మా కాదనలేనిది. ఎప్పటికైనా బీజేపీకి అసలైన ముప్పు రాహుల్‌ నుంచే ఉంది. దేశవ్యాప్తంగా మోదీ తరువాత సమ్మోహకశక్తిగల నేత రాహుల్‌ మాత్రమే. అందువల్లనే మొన్నమొన్నటి వరకు రాహుల్‌ను పప్పు అని ముద్ర వేసిన కాషాయ పరివారం ఇప్పుడు తన పేరు వింటేనే బెంబేలు పడుతుంది. కనుకనే భారత్‌ జోడోయాత్ర ద్వారా దేశంలోని సకల ప్రాంతాల యువత మనసును గెలుచుకున్న రాహుల్‌కు చెక్‌ పెట్టాలనుకున్నారు. ఈ కుతంత్రం ఎంత పరాకాష్టకు చేరిందో ఈ రెండు రోజుల పరిణామాలు చెబుతున్నాయి.

ఇతరులందరి కన్నా మోదీ పాలన మీద ప్రశ్నల పరంపర కురిపిస్తున్న రాహుల్‌ను, కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరచడం ద్వారా తమ పాలనకు ఎదురు లేకుండా చేసుకోవాలనుకున్నారు. ఈ కారణంగానే ఎవరేమనుకుంటారో అనే జంకు లేకుండా రాహుల్‌ గాంధీ మీద అనర్హత వేటుకు తెగబడిరది బీజేపీ.

పాలకపక్షం అన్ని వైపుల నుంచి తన మీద చేస్తున్న దాడిని మరింత బలంగా ఎదుర్కొంటూ తిరుగులేని నాయకునిగా రాహుల్‌ ఎదిగే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్‌తో విభేదించే పార్టీలన్నీ ఇప్పుడు రాహుల్‌ మీద చర్యను గర్హిస్తున్నాయి. దేశంలోని కాంగ్రెస్‌ శ్రేణులన్నీ రాహుల్‌కు మద్దతుగా సంఘటితమవుతున్నాయి. ఈ నేపథ్యాన ప్రస్తుత సంక్షోభ స్థితిని ఓ సదవకాశంగా మలుచుకుని నరేంద్రమోదీని మరింత దీటుగా ఎదుర్కోగల నాయకునిగా రాహుల్‌గాంధీ అవతరించే అవకాశముంది. ఈ దిశగా కాంగ్రెస్‌, రాహుల్‌ వేసే అడుగులే మున్ముందు రాజకీయ పరిణామాలని నిర్దేశిస్తాయి.

First Published:  24 March 2023 5:30 PM IST
Next Story