Telugu Global
National

అమ్మాయిని ఐటమ్ అన్నా లైంగిక వేధింపే.. ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు వ్యాఖ్యలు

అబ్బాయిలు లైంగిక వేధింపుల ఉద్దేశంతోనే అమ్మాయిలను ఐటమ్ అనే కామెంట్స్ చేస్తుంటారని ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్ బాలికను ఐటమ్ అని వేధించిన ఓ యువకుడికి కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది.

అమ్మాయిని ఐటమ్ అన్నా లైంగిక వేధింపే.. ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు వ్యాఖ్యలు
X

అమ్మాయిలను ఐటమ్ అని పిలిచినా.. అది లైంగిక వేధింపు కిందకే వస్తుందని.. అబ్బాయిలు లైంగిక వేధింపుల ఉద్దేశంతోనే అమ్మాయిలను ఐటమ్ అనే కామెంట్స్ చేస్తుంటారని ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్ బాలికను ఐటమ్ అని వేధించిన ఓ యువకుడికి కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ముంబైకి చెందిన ఒక మైనర్ బాలిక 2015 జూలై 14న స్కూలు నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా.. స్థానికంగా ఉండే ఒక 25 ఏళ్ల యువకుడు 'ఏయ్ ఐటమ్ ఎక్కడికి వెళ్తున్నావ్' అని కామెంట్ చేశాడు. తనను ఇలా వేధించవద్దని బాలిక ఆ యువకుడిని కోరగా.. ఆగ్రహం చెందిన యువకుడు బాలిక జుట్టు పట్టుకుని లాగాడు. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు.

ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తుండగా బైక్ పై ఆమెను వెంబడించాడు. ఆ యువకుడు వేధింపులు తట్టుకోలేక బాలిక డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చేలోగా అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 354, 354(డీ), 506, 504 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ ముంబై ప్రత్యేక పోక్సో కోర్టులో జరుగుతోంది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ అన్సారీ మాట్లాడుతూ.. అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగా అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే ఐటమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారని వ్యాఖ్యానించారు.

అమ్మాయిని ఐటమ్ అని పిలవడమే కాకుండా ఆమె వెంట పడడంలో నిందితుడి ఉద్దేశమేంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇలా రోడ్ల వెంట అమ్మాయిలను వేధించే యువకులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సందర్భంగా మైనర్ బాలికను వేధించిన యువకుడికి కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది.

First Published:  26 Oct 2022 1:02 PM IST
Next Story