Telugu Global
National

కాగ్ తిట్టినా రైల్వేకు పట్టదు.. ప్రాణాలు పోతున్నా లెక్క లేదు

పదే పదే భారత రైల్వే పట్టాలు తప్పుతోంది. విచారణ కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారే కానీ, గుణపాఠాలు నేర్వకపోవడం వల్లే సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. కాగ్ ఈ విషయాలనే ప్రస్తావించింది.

కాగ్ తిట్టినా రైల్వేకు పట్టదు.. ప్రాణాలు పోతున్నా లెక్క లేదు
X

వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం, ఒకటీ అరా సంఘటనలు ఎవరూ లెక్కచేయరనే ధైర్యం, ఎక్కడికక్కడ నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్న నిర్లక్ష్యం.. అన్నీ కలసి భారత రైల్వేను సర్వనాశనం చేస్తున్నాయి. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ కాదు, స్వయానా భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఇచ్చిన నివేదిక. తాజాగా ఒడిశా దుర్ఘటన తర్వాత గతేడాది కాగ్ ఇచ్చిన నివేదిక మరోసారి హైలెట్ అవుతోంది. పదే పదే అక్షింతలు వేసినా దులిపేసుకుంటూ పోతున్నందునే ఇప్పుడీ భారీ ప్రమాదంతో భారత రైల్వేల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తోంది.

తప్పు జరిగింది, విచారణ కమిటీ వేసి కారణం కనిపెట్టారు, దాన్ని సరిదిద్దుకుంటే మరోసారి అలాంటి తప్పు ఇంకెక్కడా జరగదు. కానీ పదే పదే భారత రైల్వే పట్టాలు తప్పుతోంది. విచారణ కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారే కానీ, గుణపాఠాలు నేర్వకపోవడం వల్లే సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. కాగ్ ఈ విషయాలనే ప్రస్తావించింది. ప్రమాదాల తర్వాత విచారణలో వెలుగు చూసే విషయాలను రైల్వే అధికారులు పట్టించుకోవట్లేదని కుండబద్దలు కొట్టింది CAG.

1. రైల్వే నియమాలు, జాయింట్ ప్రొసీజర్ ఆర్డర్స్(JPO)ని పట్టించుకోకపోవడం

2. సిబ్బందికి సరైన శిక్షణ, కౌన్సెలింగ్ లేకపోవడం

3. సరైన పర్యవేక్షణ లేకపోవడం

4. వివిధ విభాగాల సిబ్బంది మధ్య సమన్వయం, సంబంధం లేకపోవడం

5. తనిఖీలు చేయకపోవడం.. ఈ ఐదు తప్పులు పదే పదే జరగడం వల్లే రైళ్లు పట్టాలు తప్పుతున్నాయని, ప్రమాదాలకు కారణమవుతున్నాయని తేల్చింది CAG.

రైళ్లు పట్టాలు తప్పిన సందర్భాల్లో ఎంక్వయిరీ సరిగా జరగడం లేదని, ఒకవేళ జరిగినా ఆ రిపోర్టులను బుట్టదాఖలు చేస్తున్నారని, అందుకే పదే పదే అలాంటి సంఘటనలే పునరావృతం అవుతున్నాయని చెప్పింది CAG. బాలాసోర్ ఘటనలో 288మంది చనిపోగా 1175మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రైల్వే శాఖ తమ తప్పేమీ లేదని కవర్ చేసుకోడానికి ప్రయత్నించింది. కేంద్రం కూడా ఇటీవల రైల్వే అభివృద్ధికోసం చేపట్టిన కార్యక్రమాలను ఏకరువు పెట్టింది. కొత్త రైళ్లు, సూపర్ ఫాస్ట్ రైళ్లు, శుభ్రమైన రైల్వే స్టేషన్లు, అదిరిపోయే సౌకర్యాలు.. అంటూ ఊదరగొట్టారే కానీ రైల్వే భద్రతకు తీసుకున్న చర్యలు మాత్రం చెప్పడంలేదు. గతేడాది CAG వేసిన అక్షింతల గురించి మాత్రం నోరెత్తడంలేదు.

మానవ తప్పిదం అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి తప్పించుకుంటున్నారే కానీ, రైల్వే వైఫల్యాన్ని మాత్రం ప్రభుత్వం ఒప్పుకోవడంలేదు. కోట్ల రూపాయల నిధులు సుందరీకరణ పేరుతో విడుదల చేస్తున్నారే కానీ, భద్రతా పరమైన చర్యలకు వాటిని వాడటం లేదు. సిబ్బంది కొరతపై దృష్టి పెట్టలేదు. కొత్త రూట్లు, రైళ్ల కోసం పాకులాడుతున్నారు కానీ, రద్దీ రూట్లను ఎప్పటికప్పుడు పునరుద్ధరించే చర్యలు చేపట్టడంలేదు. CAG రిపోర్ట్ చూస్తే కేంద్రం కానీ, రైల్వే శాఖ కానీ ప్రచార ఆర్భాటం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, అదే సమయంలో ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసిందనే విషయం అర్థమవుతుంది. తాజా రైలు ప్రమాదం విషయంలో గతేడాది రైల్వే వ్యవస్థపై CAG ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

First Published:  4 Jun 2023 10:35 AM GMT
Next Story